షాప్ వద్దకు పోకుండానే షాప్ లోని సరకులు నేరుగా మన ఇంటికే రప్పించుకునే ఆన్ లైన్ షాపింగే అతిపెద్ద రివల్యూషన్ అనుకుంటే ఇప్పుడు మన ఇంటిముందుకే సరుకులు మోసుకొచ్చి అవసరమైనవి తీసుకోవడానికి అవకాశం ఇస్తున్న డ్రైవర్ లెస్ వాహనం మరో కొత్త కన్జూమర్ విప్లవానికి దారి తీస్తోంది. ఇలా నడిచొచ్చే సూపర్ మార్కెట్‌కు మొబి అని పేరు పెట్టారు. ఇది కనుక సక్సెస్ అయి ప్రపంచమంతా పరిచయమైతే ఇంటి సామానుకోసం వీధి చివరి పచారీ కొట్టుకెళ్లడం, సిటీల్లోనైతే కారేసుకుని సూపర్‌మార్కెట్‌కు వెళ్లడం.. ఇవన్నీ గత కాలపు పనులైపోతాయంటున్నారు మార్కెటింగ్ నిపుణులు. ఇదెలా సాధ్యం?
చైనాలోని షాంఘై పట్టణ వీధుల్లో సందడి చేస్తోంది ఈ నడిచొచ్చే సూపర్‌మార్కెట్. పేరు మొబీ. డ్రైవర్ అవసరం లేని ఈ వాహనం ఎంచక్కా మీ ఇంటివద్దకే వచ్చేస్తుంది మరి. చేయాల్సిందల్లా.. సరుకులతో నిండిన మోబీలోకి ఎంటరైపోయి కావల్సింది కొనుక్కోవడమే. సూపర్ మార్కెట్ కాన్సెప్ట్నే మార్చిపడేస్తున్న ఈ సరికొత్త సాంకేతిక అనుభవం ప్రపంచానికి అందుబాటులోకి వస్తే మన వీధి అంగడిని, బజారులో సూపర్ మార్కెట్‌ని ఇక మర్చిపోవలసిందే అంటున్నారు.
చైనాలో తయారైన ఈ మొబి వాహనం ఎప్పుడు ఎక్కడ ఉండేదీ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో ఇట్టే తెలిసిపోతుంది. అయినా.. కష్టపడి స్టోర్ దాకా వెళ్లాలా అనుకుంటే అదే స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆర్డరిస్తే చాలు.. మోబీ నుంచి రివ్వున ఎగిరే డ్రోన్.. సరుకులను మీ ఇంటి ముందుకు తీసుకొచ్చేస్తుంది. ఇందుకోసం ఒక్కో మోబీ స్టోర్‌లో ప్రత్యేకంగా నాలుగు డ్రోన్లు ఉంటాయి. కృత్రిమ మేధ సాయంతో ఎవరు ఏం కొన్నారు, దానికి బిల్లు ఎంతైందన్న వివరాలను నమోదు చేస్తుంది కూడా.
ఈ మొబైల్ సూపర్ మార్కెట్ ఒకవైపు సూర్యుడి శక్తితోనే పనిచేస్తూనే.. గాల్లోని విషతుల్యమైన సూక్ష్మ ధూళి కణాలను కూడా శుభ్రం చేస్తుందట. ఈ మోబీ స్టోర్‌లోకి ఎంటరవగానే... ఓ హాలోగ్రామ్ మీకు హలో చెబుతుంది. స్టోర్‌లో ఏవైనా వస్తువులు లేకపోతే.. లేదా మీకు ప్రత్యేకంగా ఏవైనా అవసరముంటే ఈ హాలోగ్రామ్కు చెబితే.. తెప్పించి ఇచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. హీఫీ విశ్వవిద్యాలయం, హిమాలయ సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొబీ.. సూపర్మార్కెట్లకు మాత్రమే కాకుండా.. మందుల షాపులుగానూ, ఏటీఎం సెంటర్లగానూ వాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. షాంఘైలో ప్రస్తుతం తొలి మొబీ స్టోర్‌ను ప్రయోగాత్మకంగా నడిపి చూస్తున్నారు.