అధికార ఏఐడీఎంకే పార్టీపై జనంలో పెరుగుతున్న ఆగ్రహావేశాన్ని తగ్గించడానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రజాకర్షక బాటపట్టారు. తమిళనాడుకు శిరోభారంగా మారే అత్యంత వ్యయంతో కూడిన అయిదు పథకాలను ప్రకటించారు. ఇవన్నీ 2016 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత చేసిన వాగ్దానాలే కావడం విశేషం. 50 శాతం సబ్సిడీతో శ్రామిక మహిళలకు మోపెడ్లు, గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయాన్ని 12 వేల నుంచి 18 వేలకు పెంచడం వంటివి వీటిలో కొన్ని.
వీటితోపాటు తమిళనాడులో తక్షణమే 500 మద్యం షాపులను మూసివేస్తున్నట్లు పళని ప్రకటించారు. మద్యనిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తానన్న అమ్మ వాగ్దానం చేశారు. అలాగే జాలర్లకు 5 వేల ఇళ్లు కట్టించి ఇవ్వడం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి పెంచడం కూడా ఈ వాగ్దానాల్లో ఉన్నాయి. ఈ పంచ వాగ్దానాలకు ప్రభుత్వ ఖజానా నుంచి ఏటా 676 కోట్ల రూపాయలు అనదంగా ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.
దేశంలోనే సంక్షేమ పథకాలను మితిమీరి అమలు చేస్తున్న రాష్టంగా తమిళనాడుకు పేరుంది. అధికారాన్ని నిలుపుకోవాలనో, జనం ఆగ్రహాన్ని మళ్లించాలనో కానీ పళని స్వామి ప్రకటించిన ఈ వాగ్దానాలు అమలయితే ప్రభుత్వం ఆర్థిక భారాన్ని ఎలా తట్టుకోగలుగుతుందనేది ప్రశ్నార్థకమే.