అరవై పరుగులకు 4 వికెట్లు పడ్డా గెలుస్తామనే అనుకున్నా: కోహ్లీ
సోమవారం, 16 జనవరి 2017 (02:36 IST)
భారత క్రికెట్ చరిత్రలో నిజంగానే కోహ్లీ శకం ఆరంభమైంది. అది కూడా సాదాసీదాగా కాదు. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న 35 వేలమంది ప్రేక్షకులు, కోట్లాదిమంది టీవీ ప్రేక్షకులు ఆశలు వదిలేసుకున్న చోటే కారుచీకటిలో కాంతిరేఖలాగా కోహ్లీ జట్టు ఆశల్ని మోసుకెళ్లే అద్భుతం సృష్టించాడు. ఆ అద్భుతంలో మెరిసిన మరో మెరుపు కేదార్ జాదవ్. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ విధించిన చోట.. 12 ఓవర్ల వ్యవధిలో నలుగురు మేటి ఆటగాళ్ల వికెట్లు టపాటపా రాలిపోయిన చోట 36 ఓవర్ల వరకూ ఏటికి ఎదురీదుతూ, 263 పరుగుల వరకూ మరో వికెట్ చేజార్చనీయకుండా అపజయానికి మేరుపర్వతంలా అడ్డుపడి ఎదుటి బ్యాట్స్‌మెన్‌కు స్ఫూర్తి నివ్వడం మాటలు కాదు. సంక్లిష్ట పరిస్థితుల్లోనూ మనం గెలువగలం, గెలుస్తాం అంటూ తనతోపాటు ఆడుతున్న కేదార్‌కు ధైర్యం నూరిపోసిన క్షణంలోనే భారత విజయం లిఖితమైపోయింది. ఆట ముగియగానే కోట్లాది మంది తలపుల్లో మెదిలిన మాట ఒకటే.. ఏం ఆట ఇది. అద్భుత విజయంతో తన శకాన్ని మొదలెట్టిన విరాణ్మూర్తి కోహ్లీ మాటల్లోనే పరాజయం నీడల్లోంచే పైకి లేచిన ఇంగ్లండుతో తొలి వన్డే విజయ పరిణామాన్ని విందాం.
"ఈ విజయాన్ని మర్చిపోవాలంటే చాలా కాలం పడుతుంది. 350 పరుగుల విజయలక్ష్యం. 60 పరుగులకే 4 వికెట్లు రాలిపోయాయి. ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు కురిపిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విజయం గురించి ఆలోచించాలన్నా కష్టమే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా గెలవాలంటే ఒక ప్రత్యేక భాగస్వామ్యం అవసరం అవుతుంది. కేదార్ ద్వారా అది సాధ్యమయింది. అతడి శక్తిసామర్థ్యాలేమిటో గతంలోనూ చూసి ఉన్నాం. ఈరోజు కేదార్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఇక హర్దిక్ పాండ్యా ఫినిషింగ్ టచ్ మరచిపోలేనట్టిది....
60 పరుగులకు 4 వికెట్లు రాలిపోయిన స్థితిలో కూడా గెలుపు గురించే నేను ఆలోచిస్తున్నాను. కేదార్ చక్కటి స్ట్రైకింగ్ ఇవ్వడం చూసిన క్షణంలో అతడితో మైదానంలోనే మాట్లాడాను. 60 పరుగులకు 4 వికెట్ల నుంచి 150కి 4 వికెట్లకు ఆటను తీసుకెళ్లమని చెప్పాను. ఆ క్షణంనుంచే ఇంగ్లండ్ జట్టులో వణుకు మొదలైంది. మీరు చూశారుగా. అద్భుతమైన ఆట. మహాద్భుతమైన ఇన్నింగ్స్, పరుగుల కోసం కేదార్ని నిజంగానే కష్టపెట్టాను. ఆట మధ్యలోనే అత్యుత్తమంగా ఆట గురించి నేర్చుకుంటాం. అక్కడే అతడిని ముందుకు నెట్టాలనుకున్నా. అతడికి ప్రత్యేక సామర్థ్యం ఉంది. అది బయటకు రావాలన్నదే నా కోరిక.
నిజంగా కేదార్‌కు అభినందనలు. అతడి కుటుంబం కూడా మైదానంలో ఉండి అతడి ఆటను కళ్లారా చూసింది. ఎంత అద్భుత ప్రదర్శన. పరాజయ స్థితి లోంచి బయటపడాలంటే మనం చేయాల్సింది ఎదురుదాడే. సింగిల్స్‌తో మనం గెలవలేం. మేం ఇప్పటికీ గెలవగలమనే నమ్మకాన్ని ప్రత్యర్థిలో కలిగిస్తూ భీతి పుట్టించాలి. వికెట్ మందకొడిగా ఉంది. బౌలర్లు ఉత్తమమైన ఆటను చూపించాల్సిందే. ప్రారంభంలో మేం చాలా బాగా బౌలింగ్ చేశాం. కానీ చివరకు వచ్చేసరికి ఇంగ్లండ్ జట్టు ఎదురుదాడి ప్రారంభించింది" అంటూ అద్భుత విజయ క్రమాన్ని కోహ్లీ విశ్లేషించాడు
విజయం కళ్లముందు కదలాడి కూడా వెనక్కు పోయిన స్థితిని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ సరిగ్గానే చెప్పాడు. "60 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చివేసినప్పుడు గెలుపు మాదే అనిపిస్తుంది. అంత భారీ లక్ష్యాన్ని ఆ స్థితిలో ఛేదించడం చాలా కష్టం. కానీ క్రెడిట్ భారత్‌దే. మాకెలాంటి అవకాశాలు వాళ్లు ఇవ్వలేదు. మా ఉత్తమమైన ఆటను మేం ఈరోజు ఆడలేదు. చివరివరకు పైచేయిలోనే ఉన్నాం. మా ఇన్నింగ్స్‌లో 35 ఓవర్ల నుంచి 45 ఓవర్ల దాకా పరుగులు కాస్త మందగించాయి మరో 20 పరుగులు అదనంగా చేసి ఉన్నా ఫలితం మరోలా ఉండేది. జోస్ వికెట్ తీసిన ఘనత భారత్‌దే. అక్కడే ఆట మలుపు తిరిగింది. భారత్ దాన్ని ఒడిసి పట్టుకుంది" అని మోర్గాన్ సరిగానే అంచనా వేశాడు.
ఈ విజయం ద్వారా భారత్ మరో రికార్డును సాధించింది. వన్డే చరిత్రలో నాలుగవ అతిపెద్ద ఛేదనను భారత్ సాధించింది. ఇంతవరకు ప్రపంచ వన్డే క్రికెట్లో అయిదు అతి పెద్ద ఛేదనలు నమోదైతే వాటిలో మూడు పెద్ద ఛేదనలు భారత్ పేరిట లిఖితమయ్యాయి. కోహ్లీ శకానికి ఇదొక పెద్ద నాంది.