బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో తమకు ఎంతో ఆత్మవిశ్వసాన్ని నింపిందని పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ అన్నారు. బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విసిరిన 490 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్థాన్ పోరాట ప్రదర్శన కనబరిచింది. లక్ష్య ఛేదనలో 450 పరుగులు సాధించి 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం మిస్బా మాట్లాడుతూ ఈ టెస్ట్ మ్యాచ్‌లో తుది వరకూ పోరాడటం తమ జట్టు సభ్యల్లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని వ్యాఖ్యానించాడు. రెండో టెస్టులో కూడా అదే తరహా ఆటను ప్రదర్శించి ఆసీస్ ను మరొకసారి ఒత్తిడిలోకి నెట్టడానికి యత్నిస్తామన్నాడు. ప్రస్తుతం తమ ఆటగాళ్లు నెట్స్‌లో విరామం లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారన్నాడు. దానికి కారణం తొలి టెస్టు నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసమేనన్నాడు.
దీనిపై ఆయన స్పందిస్తూ... 'రెండో టెస్టులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా నిలకడ ఆటడానికి యత్నిస్తాం. ఈసారి ఎటువంటి అవకాశాన్ని వదలం. సమిష్టగా రాణిస్తే ఆసీస్‌ను మట్టికరిపించడం కష్టం కాదు. వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు, సమష్ట కృషి కూడా అవసరం. దానిపై దృష్టి సారించాం' అని చెప్పాడు.