ఆసియా కప్‌లో భారత్ జోరు.. శ్రీలంకపై గెలుపుతో ఫైనల్‌కు

బుధవారం, 13 సెప్టెంబరు 2023 (11:10 IST)
ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా భారత్ తన జోరును కొనసాగిస్తుంది. గ్రూపు-4లో దాయాది దేశం పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్... మంగళవారం జరిగిన మరో మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టును ఓడించింది. దీంతో ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలించింది. 
 
శ్రీలంక రాజధాని కొలంబోలో మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్... 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన శ్రీలంక... 41.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మరోసారి మాయాజాలం చేశాడు. ఓ దశలో శ్రీలంక 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా, వెల్లాలగే (42 నాటౌట్) అద్భుత పోరాటం కనబరిచాడు. ధనంజయ డిసిల్వా (41)తో కలిసి విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరి పుణ్యమాని ఆ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 
 
అయితే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లంక బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు 2, సిరాజ్ కు 1, హార్దిక్ పాండ్యాకు 1 వికెట్ దక్కాయి.
 
కాగా, లంక గత 13 వన్డేల్లో ఓటమి లేకుండా వస్తోంది. ఇప్పుడా జైత్రయాత్రకు భారత్ అడ్డుకట్ట వేసింది. ఆసియా కప్ సూపర్-4 దశలో భారత్ తన తదుపరి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఈ నెల 15న ఆదివారం ఆడనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు