ఇంగ్లండ్‌తో టెస్టు క్రికెట్లో జయకేతనం ఎగురవేసిన టీమిండియా వన్డే సిరీస్‌కు సంసిద్ధమవుతోంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ 2017 జనవరి 15న ప్రారంభంకానుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. సొంతగడ్డపై పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో ఆతిథ్య భారత్ వన్డే సమరానికి సంసిద్ధమవుతోంది. టెస్టు సిరీస్‌లో టీమిండియాతో పాటు అదరగొట్టేసిన కోహ్లీ క్రేజ్ పెరిగిన నేపథ్యంలో పరిమిత ఓవర్లలో జట్టుకు ఎలాంటి విజయాన్ని సాధించిపెడుతాడని ధోనీపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇప్పటికే ఇంగ్లండ్-భారత్ మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు క్రికెట్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే జనవరి 15న పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ)ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లు తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడానికి నెలరోజుల ముందు అనగా ఈ నెల 15న టికెట్ల అమ్మకాలు ప్రారంభించగా కేవలం 12 రోజుల్లోనే టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఆఫ్‌లైన్, ఆన్లైన్ ద్వారా విక్రయించే టికెట్లన్నీ అయిపోయినట్లు ఎంసీఏ ప్రకటనలో తెలిపింది. పుణే వేదికగా చివరి సారిగా అక్టోబర్ 13, 2013న భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. చాలా రోజుల తర్వాత వన్డే జరగబోతున్నందున టికెట్లు కొనడానికి స్థానికులు పెద్దఎత్తున పోటీపడ్డారు.