ఐపీఎల్ 2023 : మరుపురాని విజయాన్ని అందుకున్న రాజస్థాన్
శుక్రవారం, 12 మే 2023 (09:23 IST)
Rajasthan Royals
ఐపీఎల్ 2023 టోర్నీలో భాగంగా, గురువారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎట్టకేలకు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తద్వారా ప్లే ఆఫ్స్‌కు అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంది. గత మూడు మ్యాచ్‌లలో వరుస ఓటములను మూటగట్టుకున్న రాజస్థాన్ రాయల్స్.. గురువారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయింది.
తొలుత బంతితో అదరగొట్టి ప్రత్యర్థి జట్టుని కేవలం ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ ఆటగాళ్లు బ్యాట్‌తోనూ రాణించారు. 149 పరుగుల లక్ష్య ఛేదన కోసంబరిలోకి దిగిన రాజస్థాన్.. లక్ష్యఛేదనలోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఆ జట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో 13 ఫోర్లు, ఐదు సిక్స్‌లో సాయంతో రెచ్చిపోయి 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అలాగే, మరో బ్యాటర్ సంజూ శాంసన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 48 పరుగులు చేశాడు. దీంతో 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి అలవోకగా ఛేదించి మరుపురాని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా బ్యాటర్లు.. వెంకటేశ్ అయ్యర్ 57 పరుగులు చేయగా, నితీశ్ రాణా 22, రెహ్మనుల్లా గుర్భాజ్ 18, రింకు సింగ్ 16, జేసన్ రాయ్ 10, రస్సెల్ 10 చొప్పున పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ రెండు, సందీప్ శర్మ, ఆసిఫ్ తలో వికెట్ చొప్పున తీశారు.