ధోనీ టీ-20 వరల్డ్ కప్ ఆడుతాడా? నో రిటైర్మెంట్ (వీడియో)

శుక్రవారం, 12 జులై 2019 (15:17 IST)
భారత క్రికెట్ చరిత్ర పుటల్లో మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేకంగా ఓ పేజీ అంటూ ఉంటుంది. ధోనీ సాధించిన విషయాలు, ఘనతలు దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేశాయి. అయితే, ఇపుడు ధోనీ ఆటతీరు ప్రతి ఒక్క భారతీయ క్రికెట్ అభిమానికి తీవ్ర నిరాశకు లోనుచేస్తోంది. ముఖ్యంగా, ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో ధోనీ ఆటతీరు పూర్తిగా నిరుత్సాహంగా సాగింది. మునుటిలా ధోనీ బ్యాటింగ్ చేయలేక పోతున్నాడు. 
 
దీంతో ధోనీ ఆటతీరుపై అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఫలితంగా ఈ ప్రపంచ కప్ తర్వాత ధోనీ తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెబుతాడనే వార్తలు వచ్చాయి. కానీ, న్యూజిలాండ్‌తో భారత్ ఓడిపోయిన తర్వాత భారత క్రికెట్ జట్టు స్వదేశానికి రావాల్సిందివుంది. కానీ, ధోనీ మాత్రం తన భవిష్యత్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
అదేసమయంలో భారత క్రికెట్ జట్టు త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకోసం ఈ నెల 17 లేదా 18 తేదీల్లో భారత క్రికెట్ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఈ టూర్‌కు విశ్రాంతి లేకుండా ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పేసర్ జస్ప్రీర్ సింగ్ బుమ్రాలతో పాటు.. మరికొంతమందికి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు బాగానే ఉందిగానీ ఈ టూర్‌కు ధోనీని ఎంపిక చేయాలా వద్దా అనేది సెలెక్టర్లకు అంతుచిక్కడం లేదు. 
 
వరల్డ్ కప్ ప్రదర్శన నేపథ్యంలో రిటైర్మెంట్ ఇస్తాడన్న ప్రచారం నేపథ్యంలో, ఈ మాజీ సారథి నుంచి వచ్చే కబురు కోసం సెలక్టర్లు వేచి చూస్తున్నారు. తాను ఇక క్రికెట్ నుంచి తప్పుకుంటన్నట్టు ధోనీ ప్రకటిస్తే సరి, లేకపోతే అతడ్ని కరీబియన్ టూర్‌కు ఎంపిక చేయాలా, లేక పక్కనబెట్టాలా అన్నది సెలక్టర్లకు తలనొప్పిగా మారింది. అదేసమయంలో రిషబ్ పంత్ రూపంలో ధోనీ వారసుడు భారత క్రికెట్ జట్టుకు లభించాడు.

21 యేళ్ళ ఎడంచేతివాటం కుర్రోడు అటు కీపర్‌గా ఇటు బ్యాట్స్‌మెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో ధోనీ తన రిటైర్మెంట్‌పై స్పష్టత ఇస్తే ఆ స్థానాన్ని రిషబ్ పంత్‌తో భర్తీ చేయాలన్న ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ధోనీ ప్రస్తుతానికి రిటైర్మెంట్ ప్రకటించ కూడదని.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ-20 క్రికెట్ సిరీస్‌లో పాల్గొనాలని క్రికెట్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు