తాను కెప్టెన్సీని వదిలివేసినపుడు ధోనీ ఒక్కడే వ్యక్తిగతంగా అండగా నిలిచాడని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. పైగా, టీవీల ముందు కూర్చొని ప్రపంచం మొత్తం తెలిసేలా ఇచ్చే సలహాలకు తాను విలువ ఇవ్వబోనని స్పష్టం చేశాడు. ఆసియా కప్ టోర్నీలో మళ్లీ గాడినపడిన విరాట్ కోహ్లీ ఆదివారం పాకిస్థాన్ జట్టు జరిగిన కీలక మ్యాచ్‌లో 60 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ విలేకరుల సమావేశంలో అనేక విషయాలు వెల్లడించారు.
తాను టెస్ట్ కెప్టెన్సీ వదిలి వేసినపుడు ఒకే ఒక్క వ్యక్తి నుంచి నాకు మెసేజ్ వచ్చింది. గతంలో ఆ వ్యక్తితో కలిసి నేను ఆడాను. ఆ వ్యక్తి ఎమ్మెస్ ధోనీ. మరెవరూ నాకు మెసేజ్‌లు చేయలేదు. నా ఫోన్ నంబరు అనేక మంది వుంది. కానీ, చాలా మంది టీవీల్లో సలహాలు ఇస్తుంటారు. ధోనీ ఒక్కడే నాకు వ్యక్తిగతంగా మెసేజ్ ఇచ్చాడు.
అలాగే, పలువురు మాజీలు బహిరంగంగా సలహాలు ఇవ్వడంపై ఆయన స్పందిస్తూ, నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే వ్యక్తిగతంగా చెబుతాను. మీరు టీవీల ముందు కూర్చొని ప్రపంచం మొత్తం తెలిసేలా నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే వాటికి నేను విలువ ఇవ్వను. మీరు నాతో వ్యక్తిగతంగా మాట్లాడొచ్చు. వాటిని నేను నిజాయితీగా పరిశీలిస్తాను. అవి ఎలా ఉంటాయో మీరే చూస్తారు. దేవుడు అన్నీ ఇచ్చినపుడు మీరు విజయం సాధించేలా ఆ భగవంతుడే చూస్తాడు. అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి" అని అన్నారు.