బీసీసీఐ అంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. పేరులో ఉన్నట్లే భారత క్రికెట్‌కు చెందిన సమస్త విషయాలను బీసీసీఐ కంట్రోల్ చేస్తుంటుంది. దానిక వ్యతిరేకంగా వ్యాఖ్యానించినవారు, విమర్శించిన వారు మట్టిగొట్టుకుపోవడమే తప్ప మళ్లీ లేచి నిలబడ్డది లేదు. దశాబ్దాల తరబడి ఇదే తీరు మరి. కానీ చరిత్రకారుడు, క్రికెట్ వీరాభిమాని రామచంద్ర గుహ బీసీసీఐ పనితీరును ఒక రేంజిలో ఏకి వదిలారు. టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర విభేదాల నేపధ్యంలో బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) కి రాజీనామా చేసి తప్పుకున్న గుహ ఆ మరుసటిరోజే తీవ్ర పదజాలంతో భారత క్రికెట్‌లో పెడధోరణుల గురించి దుయ్యబడుతూ లేఖ రాశారు.
భారత క్రికెట్‌లో సూపర్ స్టార్ సంస్కృతి విచ్చలవిడిగా పెరగడం, టెస్లుల నుంచి రిటైరైన ధోనీకి గ్రేడ్ ఏ కాంట్రాక్టు కొనసాగిస్తుండం, క్రికెట్ ఏజెన్సీలతో సంబంధమున్న గవాస్కర్‌ను వ్యాఖ్యాతగా కొనసాగించడం, ఫలానా వాడు కోచ్‌గా వద్దు అంటూ విరాట్ కోహ్లీ శాసించే స్థితికి ఎదిగిపోవడం వంటి పలు అంశాలపై రామచంద్ర గుహ బీసీసీఐ ధోరణులను తూర్పారపట్టారు.
బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నుంచి తప్పుకున్న ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ బాంబు పేల్చారు. సీఓఏ నుంచి తప్పుకున్న మరుసటి రోజే ఏడు కీలక అంశాలతో లేఖాస్త్రాన్ని సంధించారు. భారత్ క్రికెట్, బీసీసీఐలో కొనసాగుతున్న సూపర్‌స్టార్ సంప్రదాయాన్ని తీవ్రంగా విమర్శించారు.
టెస్టుల నుంచి రిటైరయిన ఎంఎస్ ధోనికి గ్రేడ్ ‘ఏ’ కాంట్రాక్టు కొనసాగిస్తుండడాన్ని తప్పుబట్టారు. 2014లో టెస్టు క్రికెట్ నుంచి తనంత తానుగా తప్పుకున్న ధోనికి టాప్ గ్రేడ్ కొనసాగించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రికెట్ ఏజెన్సీలతో సంబంధమున్న గవాస్కర్‌ను వ్యాఖ్యాతగా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు.
కొంత మంది జాతీయ కోచ్‌లకు బీసీసీఐ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. జాతీయ జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించకుండా కోచ్‌లు రెండు నెలల పాటు ఐపీఎల్ మత్తులో మునిగితేలారని ధ్వజమెత్తారు. టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేకు ఆయన బాసటగా నిలిచారు. కుంబ్లే సత్తా ఏమిటో అతడి రికార్డులే చెబుతాయని పేర్కొన్నారు.
అన్నిటికంటే మించి గుహ సూపర్ స్టార్ కెప్టెన్‌గా కోహ్లీ చలాయిస్తున్న అధికారంపై విరుచుకుపడ్డారు. ప్రొఫెషనల్ క్రీడల్లో ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ క్రీడలో కూడా ఇలాంటిది జరగదని గుహ విమర్శించారు .ఎక్కడా లేనివిధంగా కోచ్‌లు, కామెంటేటర్ల ఎంపిక విషయంలో ఆటగాళ్ల జోక్యం పెరిగిపోయిందని, ఇది కొనసాగితే, రేపు ఆఫీస్ బేరర్లను, సెలెక్టర్లను కూడా ఆటగాళ్లే నిర్ణయించేటట్లున్నారని, టీమిండియాలో సూపర్ స్టార్ల హవా హద్దులు మీరిపోయిందని రామచంద్ర గుహ ధ్వజమెత్తారు.
మొత్తం మీద మైదానంలోనూ, వెలుపలా ఉన్న భారత దిగ్గజాల వ్యవహార శైలిని, వారి అహంకార వైఖరులను గుహ తూర్పారబట్టారు. ఈ విమర్శా లేఖ చివరికి భారత క్రికెట్‌లో ఎవరిని బలి తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి. కుంబ్లే మైదానంలోకి వస్తే అక్కడ ఉండకుండా వెలుపలికి వెళ్లిపోయే సాహసానికి విరాట్ కోహ్లీ సిద్ధపడ్డాడంటే భారత క్రికెట్ భవిష్యత్తు ఏం కానుందో అర్థం కావటం లేదు.
ఇప్పుడు టీమిండియా ఉనికికి సంబంధించిన ఒక ప్రశ్న ఉంది. భారత జట్టులో, దిగ్గజాల్లో బలిపశువు ఎవరు?