సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి అరుదైన ప్రశంసలు దక్కాయి. వన్డే క్రికెట్లో భాగంగా విరాట్ కోహ్లి 10000 పరుగుల రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ భారత సారథిని ప్రశంసలతో ముంచెత్తాడు. విరాట్ కోహ్లి బ్యాటింగ్ తీరు చూస్తుంటే, అతడు మానవుడేనా అనిపిస్తుంది. అతడు బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారి సెంచరీ సాధిస్తాడనే అనిపిస్తుంటుంది.
అతడి ఫిట్‌నెస్‌పై తీసుకునే జాగ్రత్త, ఆటపై చూపించే అంకితభావం నిజంగా నమ్మశక్యం కానివి అంటూ ప్రశంసలు కురిపించాడు. మూడు ఫార్మాట్లలో కోహ్లీనే నెంబర్ వన్ ఆటగాడు. విరాట్ ఆటను చూసి ఆస్వాదించి, నేర్చుకోవాలని ఉంటుంది. అతడో అద్భుత ఆటగాడు అంటూ.. తమీమ్ కొనియాడాడు.
కాగా.. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డేల్లో వేగంగా పదివేల పరుగుల మైలురాయిని చేరిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ల పరంగా సచిన్ టెండూల్కర్, బంతుల పరంగా శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య రికార్డులను అధిగమించాడు. సచిన్ 259 ఇన్నింగ్స్‌ల్లో పదివేల పరుగుల మార్క్‌కు చేరగా.. ఈ రికార్డును కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లోనే దాటేశాడు.
పదివేల పరుగుల మార్క్‌కు సనత్ జయసూర్య 11,296 బంతులు ఆడితే.. కోహ్లీ 10,813 బంతులే తీసుకున్నాడు. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన వన్డేతో కోహ్లీ ఈ అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.