హిజ్రాగా మారి వేధిస్తున్న భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

ఠాగూర్

ఆదివారం, 7 జనవరి 2024 (09:11 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. హిజ్రాగా మారి వేధిస్తున్న భర్తను భార్య చంపేసింది. గత కొంతకాలంగా తాను సన్నిహితంగా ఉంటున్న వ్యక్తితో కలిసి ఈ హత్యకు పాల్పడింది. భర్త హత్యకు ఏకంగా రూ.18 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని రెండు విడతల్లో రూ.9 లక్షలు చెల్లించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ హత్య గత యేడాది డిసెంబరు 11వ తేదీన జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేపట్టడంతో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సిద్ధిపేట సీఐ కృష్ణారెడ్డి వెల్లడించిన కేసు వివరాల మేరకు సిద్దిపేట బోయిగల్లీకి చెందిన వేదశ్రీ అనే మహిళకు నాసర్పురా వీధికి చెందిన దరిపల్లి వెంకటేశ్‌తో గత 2014లో వివాహమైంది. వీరికి ఒక పాప ఉంది. అదనపు కట్నం కోసం వెంకటేశ్ భార్యను వేధించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. అయితే వెంకటేశ్ ప్రవర్తనలో క్రమంగా మార్పులు వచ్చి అతడు హిజ్రాగా మారిపోయి రోజాగా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ముదరడంతో గత ఏడేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. 
 
ఈ క్రమంలో కూతుర్ని తనకు అప్పగించాలంటూ వేదశ్రీని రోజా (భర్త) వేధించసాగాడు. దీనికి వేదశ్రీ నిరాకరించింది. దీంతో తాను కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న సిద్ధిపేటకే చెందిన బోయిని రమేశ్ కలిసి రోజాను హత్య చేయాలని వేదశ్రీ నిర్ణయించింది. గత ఏడాది డిసెంబరు 11న నాసర్పురాలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న రోజాను హత్య చేశారు. 
 
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన రమేశ్ స్నేహితుడు ఇప్పల శేఖర్ రోజాతో మద్యం తాగించాడు. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. అయితే పోస్టుమార్టంలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా వేదశ్రీతో పాటు మరో ఐదుగురి పాత్ర ఉందని నిర్ధారించారు.
 
నిందితురాలు వేదశ్రీ సహా ముగ్గురిని సిద్ధిపేట వన్ టౌన్ పోలీసులు శనివారం రిమాండుకు తరలించారు. వేదశ్రీ, బోయిని రమేశ్, ఇప్పల శేఖర్ ను శనివారం అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. కాగా కుమార్తెను తనకు ఇవ్వాలంటూ భార్య వేదశ్రీని రోజా వేధించేవాడని, ఆమె ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న ప్రైవేటు పాఠశాల వద్దకు వెళ్లి ఇబ్బందులకు గురిచేసేవాడని పోలీసులు తెలిపారు. 
 
వేదశ్రీ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న బోయిని రమేష్‌తో కలిసి హత్యకు పథక రచన చేసింది. ఇందుకు రూ.18 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని, రెండు విడతల్లో రూ.4.60 లక్షలు ముట్టజెప్పారని పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు