పూర్తి వివరాలను చూస్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ పరిధిలో వున్న కట్ఘర్ కొత్వాలికి చెందిన సమీర్ తన భార్యతో కలిసి నివాసం వుంటున్నాడు. తను విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా కారులో తన భార్య మరో యువకుడి మహీర్ అనే వ్యక్తి పక్కనే కూర్చుని కనబడింది. దీంతో షాకయిన సమీర్... కారును అడ్డుకునేందుకు బైకుతో వెంబడించాడు.
ఐతే మహీర్ కారును వేగంగా నడిపాడు. ఓ చోట రద్దీ ఎక్కువుండటంతో అకస్మాత్తుగా కారు బ్రేక్ వేయడంతో వెనకే వున్న సమీర్ బైకు కారుకి ఢీకొట్టి అతడు ఎగిరి కారు బానెట్ పైన పడ్డాడు. ఐనప్పటికీ బానెట్ పైన వుండి అద్దంపై వున్న వైపర్ ను గట్టిగా పట్టుకుని కారును ఆపాలంటూ కేకలు వేసాడు. ఐతే అదేమీ పట్టించుకోని మహీర్ కారును మరింత స్పీడుగా పోనిచ్చాడు. ఇదంతా రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు చూసి కారుని వెంబడించి కొంతదూరం తర్వాత అడ్డగించారు. రోడ్డుపై మహీర్ తో సమీర్ వాగ్వాదానికి దిగాడు. రోడ్డుపైన పెద్దఎత్తున జనం గుమికూడటంతో సమాచారం అందుకున్న పోలీసులు మహీర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.