తెలుగుదేశం పార్టీ మాజీమంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భాను కిరణ్‌ను ఎట్టకేలకు మన రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నిఘా వర్గాలు, పోలీసు ఇన్ఫార్మర్లు అందిచ్చిన సమాచారం మేరకు.. భాను కిరణ్‌ను సీఐడీ పోలీసులు శనివారం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని జహీరాబాద్ సరిహద్దుల్లో అరెస్టు చేసినట్టు సీఐడీ డీజీ వెల్లడించారు.
గత యేడాది జనవరి మూడో తేదీన సూరి హత్య జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్న భానును... ఇపుడు డబ్బే పట్టించిందా? లేకా.. రాజకీయంగా ఉపయోగించుకునేందుకు సీఐడీ పోలీసులే భాను అరెస్టును ఇపుడు బయటపెట్టారా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
సీఐడీ డీజీ రమణమూర్తి చెప్పిన మాటలను బట్టి చూస్తే.. భాను వద్ద ఉన్న రూ.4 లక్షలు ఖర్చు అయి పోవడంతో.. తన ఖర్చులకు డబ్బు తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చినట్టు చెప్పారు. వాస్తవానికి గత జనవరి నుంచి ఒక్కసారి కూడా హైదరాబాద్‌కు రాని భాను కిరణ్ ఇప్పుడే ఎందుకు వచ్చారు? అదీ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాష్ట్రానికి రావాల్సిన ఆంతర్యమైంటి?
ఇంతకు భానుకు డబ్బు ఇవ్వజూపిన నగర ప్రముఖుడెవరు? నిజంగా.. నగరానికి చెందిన ప్రముఖుడే భానుకు డబ్బు సమకూర్చేందుకు సిద్ధమైతే.. ఆ డబ్బును ఆ నగర ప్రముఖుడే భాను ఉన్న చోటికి తీసుకుని వెళ్లొచ్చు కదా? భాను ఆదేశించి ఉండొచ్చు కదా? తన కోసం పోలీసులు డేగ కళ్లతో నిఘా వేసివున్నారన్న విషయం తెలిసినప్పటికీ... భాను నగర ప్రవేశం చేసే సాహసం ఎందుకు చేశాడు?
ఇత్యాది ప్రశ్నలన్నింటికీ సీఐడీ పోలీసుల వద్ద సమాధానాలు లేవు. పైపెచ్చు.. టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో వైఎస్.జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్నట్టు ఆ పార్టీకి చెందిన నేతలు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. పరిటాల హత్యకేసులో ప్రధాన నిందితుడైన సూరికి జగన్‌కు సంబంధాలు ఉన్నట్టు లోగడ వార్తలు కూడా వచ్చాయి. సూరి చేసిన పనులన్నీ ఆయన కుడిభుజంలాంటి భాను కిరణ్‌కు బాగా తెలుసన్నది జగమెరిగిన సత్యం.
అందుకే.. రాష్ట్ర రాజకీయాలు మంచి వేడిమీద ఉన్న సయమంలో.. అందరి టార్గెట్ "ఆ ఒక్కరే" అయిన తరుణంలో భాను కిరణ్ అరెస్టును తెరపైకి తెచ్చారన్న భావన కలుగుతోంది. భానుతో తమకు తోచిన రీతిలో వాంగ్మూలం ఇప్పించి తమకు కొరకరాని కొయ్యిలా తయారైన 'ఆ ఒక్కడి'పై టార్గెట్ పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారన్న ఊహాగానాలు లేకపోలేదు. మొత్తానికి భాను అరెస్టు వెనుక అనేక ప్రశ్నలకు సమాధానం చిక్కడం లేదు.!! సో.. భాను ఇచ్చే వాంగ్మూలం ఎన్ని మలుపులకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.!!