వంశీ-జగన్ ఆలింగనం వెనుక ఎన్టీఆర్ హస్తం..?! బాబుకు షాక్..!!
శనివారం, 28 ఏప్రియల్ 2012 (18:29 IST)
File
FILE
విజయవాడనే కాకుండా తెలుగుదేశం పార్టీని ఇపుడు వంశీ - జగన్ ఆప్యాయతపూర్వక ఆలింగన రాజకీయాలు ఓ కుదుపు కుదుపుతున్నాయి. దీంతో ఈ ఆలింగంపైనే తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. అసలు వల్లభనేని పనిగట్టుకుని జగన్ కాన్వాయ్‌కు ఎదురుగా వెళ్లాల్సిన పనేంటి..? జగన్ వస్తున్న సమయంలో ఆయన కోసమే ఎదురు చూస్తూ వల్లభనేని ఎందుకు నిరీక్షించారు..? అసలు వంశీ వ్యూహం ఏంటి..? వంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టాలంటే కాస్తంత లోతుగా వెళ్లక తప్పదు. నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌కు నమ్మినబంటులా ఉండే సినీ ప్రొడ్యూసర్ నాని స్నేహితుడు వల్లభనేని వంశీ.
ఆ మధ్య తెలుగుదేశం పార్టీ పగ్గాలను యువతకు కట్టబెట్టాలనే వాదనలు తెరపైకి వచ్చాయి. దీంతో పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్‌కు ఇవ్వాలని హరికృష్ణ బహిరంగంగానే అన్నారు. హరికృష్ణ డిమాండ్‌కు ప్రొడ్యూసర్ నాని, వల్లభనేని వంశీలిద్దరూ మద్దతు పలికారు. ఐతే ఇది చంద్రబాబు నాయుడికి రుచించలేదు. ఇంతలో నారా లోకేష్ పేరు తెరపైకి వచ్చింది. పగ్గాలను లోకేష్‌కు ఇవ్వాలన్న డిమాండ్లు వినిపించాయి. దీనికి లోకేష్‌కు మామ బాలకృష్ణ మద్దతు కూడా లభించింది.
ఈ పరిణామంతో నారా - నందమూరి హరికృష్ణల మధ్య గ్యాప్ పెరిగింది. పార్టీ మీటింగులకు.. అప్పుడప్పుడు హరికృష్ణ వస్తున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పూర్తిగా తెదేపా కార్యక్రమాలకు దూరమయ్యాడు. దాంతోపాటే తన అనుయాయులుగా చెప్పుకునే నిర్మాత నాని, వల్లభనేని వంశీలు కూడా చంద్రబాబు వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగింది.
ఈ పరిస్థితుల్లో వల్లభనేని అకస్మాత్తుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్‌ను కలవడం, ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని విష్ చేయడం చూసిన తెదేపా నాయకులు ఒక్కసారి నివ్వెరపాటుకు గురయ్యారు. కింది స్థాయి కార్యకర్తలు సైతం అయోమయానికి గురయ్యారు. అవినీతి నాయకుడైన జగన్‌పై తాము సమరం చేస్తుంటే అతడిని వల్లభనేని ఎలా కలుస్తారంటూ టీడీపీ సీనియర్ నేతల నిలదీస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏకంగా కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బి.బుచ్చయ్య చౌదరీ షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు.
చిత్రం ఏంటంటే.. జగన్‌తో జరిగిన సమావేశంపై వల్లభనేని వంశీ ఇంతవరకు స్పందించలేదు. కానీ, షోకాజ్ నోటీసు జారీ కావడం, దానికి ఏ విధంగా వివరణ ఇవ్వాలన్న అంశంపై వంశీతో మరో టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (గుడివాడ) భేటీ కావడం జరగిపోయింది. మొత్తమ్మీద జగన్-వంశీ ఆలింగనం టీడీపీలో పెను సంచలనం సృష్టిస్తుండగా, చంద్రబాబు నాయుడికి గట్టిగా షాక్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వంశీ ఇలా చేశాడనీ, దీని వెనుక జూనియర్ ఎన్టీఆర్ హస్తం ఉన్నదేమోనన్న వాదనలూ లేకపోలేదు. అయితే వీటన్నింటికీ తెరపడాలంటే.. అసలు పాత్రధారి వంశీ పెదవి విప్పితే గానీ అసలు విషయం బయటపడదు. అప్పటివరకూ వెయిట్ అండ్ సీ.