భారతరత్న ఎ.పి.జె అబ్దుల్ కలాం, మననం చేసుకుందాం

మంగళవారం, 27 జులై 2021 (16:13 IST)
రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్‌ కలాం జూలై 27, 2015 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్‌లోని ఏఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ అబ్దుల్‌ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్‌ కలాంను స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆయన గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు.
 
ఈ సందర్భంగా వారిని ఓసారి గుర్తు చేసుకుంటూ...... ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి. 
 
తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేశారు.
 
భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పైన గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు.
 
అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15న జన్మించారు. తండ్రి జైనులబ్ధీన్, పడవ యజమాని మరియు తల్లి ఆషియమ్మ, గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా ఏ.పి.ఙే.అబ్దుల్ కలామ్ తోడ్పడటానికి న్యూస్ పేపర్ పంపిణీ చేసేవారు.
 
పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవారు మరియు ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి చేరి, 1954లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు. 
 
కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన స్కాలర్షిప్ రద్దుచేస్తాను అని బెదిరించాడు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్‌ను ఆకట్టుకున్నాడు. తరువాత డీన్ "కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను" అన్నారు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయారు. 
 
మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT - చెన్నై) నుండి పట్టా పొందిన తరువాత 1960లో, కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. 
 
కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ DRDOలో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. 1969లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో(ఇస్రో) చేరి, ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం(SLV-III) ప్రయోగానికి డైరెక్టర్‌గా పనిచేసి జూలై 1980లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 
 
1970 మరియు 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV మరియు SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్టులు విజయవంతం అయినాయి. 1970లలో స్థానికంగా తయారైన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. జూలై 1992 నుండి డిసెంబరు 1999 మధ్య ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్లో-II అణు పరీక్షలలో కలాం రాజకీయ మరియు సాంకేతిక పాత్ర నిర్వహించారు.
 
ఆయన తన గురించి చెపుతూ... "ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడ్ని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్‌కు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాణ్ణి. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పనిచేస్తూనే చదువుకున్నా. 
 
మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. 'మా అమ్మ మాత్రం నాకు మిగతా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్ని. దానికితోడు చదువుకుంటూ పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం, విషాదం రెండూ ఉండేవి' అని చెప్పారు. తనకు ముగ్గురు అమ్మలు అంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పారు. 
 
1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. 'ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను' అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి, మన దేశానికి నలభై ఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు. 
 
భారతదేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981లో); పద్మ విభూషణ్ (1990లో); మరియు భారత రత్న (1997లో) లతో పాటు నలభై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్. జూలై 18, 2002న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో (90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న పదవీ స్వీకారం చేశారు. ఆయన్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తన మద్దతు తెలిపింది. 
 
కలామ్ శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి. కచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. ఖురాన్తో బాటు, భగవద్గీతను కూడా చదువేవారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు, మానవతావాది. ఆయన తిరుక్కురళ్లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. ఆయన చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క "పాశురం" నైనా ప్రస్తావిస్తారు. 
 
కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుకున్నారు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఆయన భావించేవారు. ఆయన భారతదేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశారు. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన చాలా బలంగా తెచ్చారు. 
 
శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషించారు. బయో ఇంప్లాంట్స్ (bio-implants) వాడటం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించారు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్టు వేర్ కంటే ఓపెన్ సోర్సు సాఫ్టు‌వేర్‌నే సమర్థిస్తారు. ఓపెన్ సోర్సు సాఫ్టు‌వేర్‌ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వాసం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు