అమరావతి: ప‌్రతికూల పరిస్థితుల్లోనూ రెండకెల అభివృద్ధిని సాధిస్తూ, ఇపుడిపుడే ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధిస్తుంటే, దాన్ని చిదిమేసేందుకు వైసీపీ అరాచకాలు చేస్తోందని మంత్రి భూమా అఖిల ప్రియ మండిపడ్డారు. కేంద్ర బీజేపీతో వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) 18 లక్షల కోట్లు. ప్రతిరోజు వస్తు సేవల వల్ల రాష్ట్ర సంపత్తి రూ. 2,190 కోట్లు. ఒక రోజు బందు వల్ల ఈ వస్తు సేవలన్నీ ప్రభావితమవడమే కాకుండా, మళ్ళీ సామాన్య స్థితికి చేరుకోవడానికి 3 రోజులు పడుతుంది. ఈ నష్టం అంతా ఎవరు భరిస్తారు? అసలే రాష్ట్రానికి నిధులు ఇవ్వక, హోదా ఇవ్వక, బడ్జెట్ లోటు పూరించక, నెలకొల్పాల్సిన సంస్థలు ఇవ్వక ఒక పక్క కేంద్రం చేటు చేస్తోంది. ఇపుడు వైసీపీ బంద్ వల్ల ఆంధ్రప్రదేశ్ మరింత కుదేలు అవుతోందని అఖిల ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాపార ఉత్పత్తులు, రవాణా సేవలు, సరుకుల రవాణాపై ప్రతి రోజు 115 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. ఈ ఒక రోజు బందు వల్ల ఈ ఆదాయం అంతా నష్టమే కాకుండా, వ్యాపారుల టర్నోవర్ ఆరేడు రెట్లు అంటే దాదాపు 700 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. బంద్ వల్ల కార్మికుల రోజువారీ కూలీ, ఫ్యాక్టరీ కార్మికుల నష్టాలను ఎవరు భరిస్తారు? అని మంత్రి భూమా అఖిల ప్రియ ప్రశ్నించారు.
ఒక్క ఏపీఎస్ ఆర్టీసీకే నిత్యం 13 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. బందు వల్ల కనీసం 30 శాతం కూడా బస్సులు నడపగలిగినా 8 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఇక ప్రయాణికుల కష్ట నష్టాలను ఎవరు భరించాలి? అని ప్రశ్నించారు. అక్వా ఉత్పత్తుల్లో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అసలే అమెరికా, యూరప్ మార్కెట్లో డిమాండు తగ్గి అక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ బందు వల్ల అక్వా ఉత్పత్తుల రవాణా ఆగిపోయి, విదేశీ మారకద్రవ్యానికి గండి పడుతోంది. అక్వా ఉత్పత్తులు ప్రాసెసింగ్ కోసం ఫ్యాక్టరీకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఒక్క రోజులో పాడైపోయే ఇలాంటి ఆహార ఉత్పత్తుల నష్టంను వైసీపీ నేతలు భర్తీ చేస్తారా? కేంద్రం లాగా మీరు కూడా రాష్ట్రంపై కక్ష సాధిస్తారా? అని వైసీపీ నేతలను నిలదీశారు.
ఎన్నో ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, విద్యా సంస్థలు ఒక రోజు మూతపడితే, కార్మికులకు, విద్యార్థులకు, ప్రగతికి ఎంతో నష్టం. అంతేకాకుండా వాటిపై ఆధారపడి బతుకున్న వారికి కూడా ఎంత కష్టం? ఎంత నష్టం? జపాన్ వంటి దేశాల్లో నిరసన తెలపాలంటే, ఎక్కువ పని గంటలు పనిచేసి, ఉత్పత్తని మరింత పెంచి నిరసన తెలుపుతారు. ఢిల్లీలో పోరాడి పార్లమెంటును, కేంద్రాన్ని స్థంభింపచేయాల్సిన మీరు... మీ నిరసనను ఢిల్లీలో తెలపాల్సింది పోయి..ఇక్కడ అరాచకం సృష్టిస్తారా? మన కళ్లు మనమే పొడుచుకున్నట్లు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారా? భాజపాతో కుమ్మక్కయి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకుంటున్నారు... ఇపుడిపుడే రెండంకెల అభివృద్ధిని సాధిస్తున్న నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిని భ్రష్టు పట్టిస్తున్నారని ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.