ఏపీ రాజకీయం వేడెక్కింది. పాలక పార్టీ వైసిపి సీట్లను ఎవరికి గెలుపు అవకాశాలు వుంటే వారికి ఇస్తున్నామని చెబుతూ ప్రకటించేస్తూ ముందుకు వెళుతోంది. ఇపుడు రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు... సిద్ధం అంటూ దర్శనమిస్తున్నాయి. ఈ సిద్ధం అనే క్యాప్షన్ పైన పలు రకాల సెటైర్లు వస్తున్నాయి. దిగిపోవడానికి సిద్ధమా అని తెలుగుదేశం తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు. వైసిపి స్లోగన్ మాత్రం నేను పోరాటానికి సిద్ధం, మీరు నాతో నడిచేందుకు సిద్ధమా అని అంటున్నారు.
ఐతే ఏపీ రాజధాని వ్యవహారం, కరెంటు చార్జీలు పెంపు, ఇంటి పన్ను పెంపు, రహదారులు అస్తవ్యస్తం, చెత్త పన్ను... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. ఈ అసంతృప్తులన్నింటినీ సంక్షేమ పథకాలు రక్షిస్తాయని వైసిపి నమ్ముతోంది. ఆ నమ్మకం నిలబెడుతుందో కూల్చివేస్తుందో వచ్చే ఎన్నికల్లో తేలనుంది.
తెదేపా-జనసేన సీట్ల సర్దుబాటు సర్దుకునేదెప్పుడు?
అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ వచ్చేది తెదేపా-జనసేన కూటమి ప్రభుత్వం అని చెప్పారు. ఆ ప్రకారం కార్యకర్తలు కూడా కలిసి ముందుకు సాగుతున్నారు. కానీ ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో జరుగనున్న నేపధ్యంలో ఇప్పటివరకూ సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రాలేదు. విషయాన్ని నానబెడుతున్నారు. దీనితో నాయకుల్లో, కిందిస్థాయి కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసేది తమ పార్టీ అంటే తమ పార్టీ అంటూ గొడవలకు దిగుతున్న పరిస్థితులు అక్కడక్కడ కనబడుతున్నాయి. ఒకటి రెండు స్థానాల్లో అటు తెదేపా ఇటు జనసేన అభ్యర్థులను ప్రకటించేయడంతో తెదేపా-జనసేన కూటమికి బీటలు వారుతున్నాయా అనే వాదనలు సైతం వినబడుతున్నాయి.
జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నదానిపై స్పష్టత లేదు. అలాగే తెదేపా పోటీ చేసే స్థానాలు ఎన్ని అనేది తెలియడంలేదు. ఈ గందరగోళం ఇలాగే సాగితే చివరికి గత ఎన్నికల్లో మాదిరిగా వైసిపి గెలుపుకు ఇదే కారణం అవడం ఖాయమనే వాదనలు వినబడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం ఒక్కటే కాదు సీట్ల సర్దుబాటులో కూడా స్పష్టత ఇచ్చినప్పుడే ఆయా నియోజకవర్గాల్లో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు కలిసి పనిచేసే అవకాశం వుంటుంది. అలాకాకుండా గందరగోళాన్ని చివరి దాకా కొనసాగిస్తే రెండు పార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఏపీని చీల్చి గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ, ఏపీకి రాజధాని లేకుండా చేసిందనీ, రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ తీసిందని ఇప్పటికీ అవే వాదనలు వినబడుతున్నాయి. ఏపీని విభజించే ముందు రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఎలా అన్నదానిపై కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం ఆలోచన చేయలేదనీ, ప్రత్యేక హోదాను తక్షణం ఆమోదించకపోవడంతో ఏపీ ఘోరంగా నష్టపోయిందన్న భావన ప్రజల్లో వుంది.
ఇపుడు కొత్తగా ఆ పార్టీకి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఎంపికైనప్పటికీ ప్రజల్లో నెలకొన్న భావనను తొలగించడం అంత సులభం కాదు. ప్రధాని మోడీని కేడీ అంటున్న షర్మిలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్, ''మీరు కూడా తెలంగాణ ప్రజలకి చాలా వాగ్దానాలు ఇచ్చారు కదా మరి ఆ వాగ్దానాలు మీరు తుంగలో తొక్కినట్టే, మోడీజీ కూడా ఆ పనే చేశారు. రాష్ట్రాన్ని ఎందుకు మీ కాంగ్రెస్ విభజించింది? మీరు అధికారంలో ఉన్నప్పుడే ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని విమర్శిస్తారే?'' అంటూ కామెంట్ చేసారు. ఇలా ఎన్నో కామెంట్లు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వున్నాయి.