ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఈరోజు మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. తన దేహంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయని ఇటీవలే వైద్యులు తెలిపారని వెల్లడించారు. వృద్దాప్యంలో ఈ క్యాన్సర్ కణాలు నెమ్మదిగా పని చేస్తాయని వైద్యులు తెలిపారన్నారు.
అక్టోబర్ 8న తనకు కడుపునొప్పి వచ్చిందని దాంతో, కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నానని పేర్కొన్నారు. మనోబలం, అభిమానుల ఆశీర్వచనాల వల్లే ఆరోగ్యాన్ని అధిగమించానని.. మనోబలానికి మించి ఇన్నాళ్లు అభిమానుల ప్రోత్సాహం వల్లే సినిమాల్లో పనిచేస్తున్నానన్నారు.
74 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో పురస్కరాలు అందుకున్నానన్న అక్కినేని, సినిమా రంగంలో ఇన్నేళ్లు పనిచేయడమే ఓ రికార్డుగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. ప్రజల అభిమానం, ఆశీర్వచనాలు ఉంటే సెంచరీ కొడతానన్నారు. తన కుటుంబమంతా సీని రంగంలోనే సేవ చేస్తోందన్నారు. నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని 96 ఏళ్లు బ్రతుకుతానని మనోబలం చెబుతోంది. ప్రజలందరూ నన్న ఆశీర్వదించాలని కోరుతున్నానని ఆయన తెలిపారు.