పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత వాయుసేన చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు భారత్ క్షిపణులకు అందకుండా సుదూర ప్రాంతాలకు తరలిపోయాయి. ఈ విషయం తాజాగా ఓ ఆంగ్ల పత్రిక సంపాదించిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. కరాచీ నౌకా స్థావరంలో ఉండాల్సిన యుద్ధ నౌకల్లో కొన్నింటిని కమర్షియల్ టెర్మినల్స్‌లోకి తీసుకెళ్లి ఉంచగా.. మిగిలినవి ఇరాన్ సరిహద్దుల్లో ఆశ్రయం పొందాయి.
మే 8వ తేదీ నాటి చిత్రాల్లో కరాచీ నౌకా స్థావరంలో వీటి జాడ లేదు. అదేనెల 10వ తేదీన 7 వార్‌షిప్‌లు 100 కిలోమీటర్ల దూరంలోని గ్వదార్ పోర్టులో దర్శనమిచ్చాయి. వీటిల్లో జుల్ఫికర్ శ్రేణి ఫ్రిగెట్లు ఉన్నాయి. ఇవి చైనాలో తయారయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌కు కేవలం ఆరు నెలల ముందు చైనా నుంచి నాలుగు జుల్ఫికర్ శ్రేణి నౌకలు వచ్చాయి. వీటి ప్రారంభోత్సవ సమయంలో యాంటీషిప్ మిసైల్స్‌ను ప్రయోగించిన వీడియోను పాక్ విడుదల చేసింది. కానీ, సైనిక ఘర్షణ మొదలుకాగానే.. వీటి నిర్ణీత నౌకాశ్రయాన్ని వదిలి వెళ్లిపోయాయి.
ఇదిలావుంటే, ఇటీవల పాక్ ఆర్మీచీఫ్ అసిం మునీర్ తాను యద్ధంలో వీర మరణానికి ప్రాధాన్యం ఇస్తానంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రోలింగ్‌కు దారితీశాయి. ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భగవంతుడు తనను దేశరక్షణ కోసమే తయారుచేశాడని పేర్కొన్నారు. అంతకుమించి తనకు కావాల్సింది ఏమీ లేదని పేర్కొన్నారు. తాను ఒక సైనికుడినని.. వీరమరణమే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. మే 10వ తేదీన నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దళాలు దాడి చేసిన సందర్భంగా మునీర్ ఓ రహస్య బంకర్‌లో కొన్ని గంటలు తలదాచుకొన్నాడని నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు.