దంపతులు నిద్రలేమిని అంత సులభంగా తీసుకోకూడదంటున్నారు.. అమెరికా శాస్త్రవేత్తలు. దంపతుల్లో నిద్రలేమి సమస్య ఒత్తిడి సంబంధిత సమస్యలను పెంచుతుందని అమెరికాలోని ఓహియోలోని స్టేట్ యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్ ఫర్ బిహేవియర్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తెలిపారు. దంపతుల్లో నిద్రలేమి రొమాన్స్‌కే కాకుండా ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు.
హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, కీళ్ల నొప్పులతోపాటు ఇతర రోగాలకు కూడా నిద్రలేమి కారకమవుతుందని వివరించారు. నిద్రలేమి దంపతులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై జరిపిన పరిశోధనలో.. నిద్రపోయే సమయం తగ్గిన వారిలో దీర్ఘకాలిక జబ్బులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దంపతుల్లో ఒకరు విశ్రాంతి లేకుండా ఉన్నా.. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నా అది భాగస్వామి నిద్రపైనా ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి దంపతుల మధ్య బంధాన్ని మరింత దృఢతరం చేసేందుకు దారులు వెతకాలని.. నిద్రలేమికి గల సమస్యేంటో గుర్తించి పరిష్కరించుకోవాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. నిద్రలేమి కారణంగా హృద్రోగ వ్యాధులు, డయాబెటిస్ తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.