మానవ శరీరంలో ఉండే అతిపెద్ద అవయవం కాలేయం (లివర్). ఇది చేసే పనులు ఎంతో కీలకమైనవి. నోటికి రుచికరంగా తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా.. శరీరానికి తగిన శక్తిని అందించాలన్నా దీని పనితీరు భేషుగ్గా ఉండాలి. అలాగే, శరీరంలో ఉత్పత్తి అయ్యే విష పదార్థాలు బయటకు వెళ్లాలన్నా కూడా లివర్ పనితీరు ఎంతో ముఖ్యం. అలాంటి కాలేయానికి హాని చేసే కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
సాధారణంగా తీపి పదార్థాలంటే ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడుతారు. అయితే, చక్కెర అధింగా ఉండే పదార్థాలతో పాటు.. స్వీట్లు అధికంగా తీసుకునేవారిలో కాలేయం త్వరగా చెడిపోతుందట. చక్కెరను అతిగా తీసుకోవడం వల్ల లివర్లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. దీంతో కొంత కాలానికి లివర్ పనితీరు మందగించి అది చెడిపోతుంది.
విటమిన్ ఏ ఉన్న ఆహారం తీసుకుంటే కంటి సంబంధ సమస్యలు ఉండవని అందరికీ తెలిసిందే. అయితే ఈ విటమిన్ శరీరంలో మోతాదుకు మించినా దాని ప్రభావం లివర్‌పై పడుతుందట. దీంతో లివర్ ఆరోగ్యం నాశనమవుతుందట. ప్రస్తుతం మార్కెట్లో కుప్పలుతెప్పలుగా లభిస్తున్న చిప్స్ వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకున్నట్టయితే వాటిలో ఉండే రసాయనాలు, విషపూరితమైన పదార్థాలు లివర్ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపి దాని పనితీరు మందగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.