వేసవి కాలంలో మామిడి కాయలు విరివిగా లభిస్తాయి. వీటిని తినడం ద్వారా డీహైడ్రేషన్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేసవిలో చెమటలు ఎక్కువగా పడతాయి. ఫలితంగా ఇనుము, సోడియం క్లోరైడ్ వంటి శరీరం నుంచి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాకాకుండా ఉండాలంటే.. మామిడి ముక్కలు పచ్చిగా తీసుకోవడం మంచిది.
మామిడి ముక్కలపై కాస్త ఉప్పు చల్లుకుని తింటే.. శరీరం నీటి శాతాన్ని కోల్పోదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పచ్చిమామిడిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. ఇవి పండులో కన్నా పచ్చిదానిలోనే ఎక్కువని వారు చెప్తున్నారు. మామిడి ముక్కలు తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. శరీరంలోని కణాలను పునరుద్ధరించడంలో ఇందులోని పోషకాలు దోహం చేస్తాయి. రక్తహీనత కూడా అదుపులో ఉంటుంది.
అలాగని అతిగా మాత్రం తీసుకోకూడదు. వడదెబ్బ తగిలినప్పుడు పచ్చిమామిడి రసాన్ని మరిగించి తీసుకోవాలి. ఇది నీరసాన్నీ, అలసటనూ తొలగిస్తుంది. సమస్య నుంచి త్వరగా కోలుకోవడానికి దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.