ప్రస్తుత కాలంలో రకరకాల వాహనాల వాడకం ఎక్కువై పోయింది. వీటి వలన వాయు కాలుష్యం ఏర్పడి అనేక రకాలైన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. అలాగే పరిశ్రమల నుండి వచ్చే పొగ వలన కూడా కాలుష్యం ఏర్పడి రకరకాల అనారోగ్యాల బారిన పడుతున్నాము. దీనిని నివారించి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పెరట్లో మంచి మంచి మెుక్కలను పెంచుకోవాలి. ఇవి కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి మనకు స్వఛ్చమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. దీని వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే మెుక్కలలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి. వీటి ప్రయోజనమేమిటో తెలుసుకుందాం.
తులసి మెుక్క : ఇది మంచి ఔషధపు మెుక్క. దీని ఆకుల్ని మందుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ తులసి మెుక్కను ప్రతి నిత్యం పూజించటం వలన కలి ప్రభావం లేకుండా ఆనందంగా ఉండవచ్చు. ఇది సౌభాగ్యాన్ని, సుఖశాంతులను కలుగుచేస్తుంది. దీని నుండి వచ్చే గాలిని పీల్చటం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ మెుక్కను మన పెరట్లో పెంచుకోవటం వలన మనకు శారీరకంగా, మానసికంగా ఎంతో మంచి జరుగుతుంది.
కలబంద : భవనం లోపల గాలి నాణ్యతను పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. గాలిలోని బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్‌లను గ్రహిస్తుంది. మంచి స్వఛ్చమైన గాలిని అందిస్తుంది. దీనిని రకరకాల క్రీములను తయారుచేయడంలో ఉపయోగిస్తారు. దీనిని దృష్టి దోషం తగలకుండా ఇంటి ముందు వ్రేలాడదీస్తారు.
ఉసిరిమెుక్క : ఉసిరి మెుక్కను సాక్షత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు. దీనిని ఇంట్లో పెంచుకోవడం వలన అన్నీ శుభాలు జరుగుతాయి. ఈ ఉసిరి మెుక్కను కార్తీకమాసంలో పూజించటం వలన అంతా మంచి జరుగుతుంది. ఇది మంచి ఔషధపు మెుక్క. సమపాళ్లలో కలిపిన ఉసిరిక, పసుపుల చూర్ణాన్ని ఒక స్పూన్ వంతున రోజూ రెండుమూడు సార్లు పంచదార లేదా తేనె కలిపి సేవిస్తుంటే స్త్రీలల్లో కలిగే తెల్లబట్ట వ్యాధి తగ్గుతుంది. మూత్ర విసర్జన సమయంలో కలిగే చురుకు, మంట తగ్గుతాయి. అంతేకాకుండా రక్తం శుభ్రపడి చర్మవ్యాధులు తగ్గుతాయి.
ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఉసిరిక చూర్ణాల్ని వేసి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి పటికబెల్లం పొడి కలిపి తాగుతుంటే రక్తపు పోటు క్రమబద్దమవుతుంది. తలదిమ్ము, తలతిరగడం వంటి పైత్య వికారాలు తగ్గుతాయి. రెండింతల బెల్లం కలిపిన ఉసిరిక చూర్ణాన్ని గచ్చకాయ మోతాదులో సేవిస్తుంటే కీళ్లనొప్పులు, మలబద్దకం, మూలవ్యాధి, శిరోజాలు తెల్లబడడం, ఊడిపోవడం తగ్గుతాయి.
ఉసిరిక, శొంఠి, తిప్పసత్తు చూర్ణాల్ని సమంగా కలిపి ఒక స్పూను వంతున రోజూ రెండు సార్లు తేనె లేదా పాలల్లో కలిపి తీసుకుంటుంటే వీర్యవృద్ది అవుతుంది. శుక్రదోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా కీళ్లు, కండరాల నొప్పులు తగ్గుతాయి. ప్రతిరోజు అరస్పూను ఉసిరికపొడిని గోరువెచ్చని నీటితో తీసుకుంటుంటే శుక్రకణాల సంఖ్య పెరిగి సంతానవకాశాలు మెరుగవుతాయి.
పుదీనా : మంచి రంగు, రుచితో పాటు ఎన్నో ఆరోగ్య గుణాలు కలిగి ఉన్న మెుక్క. దీనిని ఇండ్లలో పెంచుకోవడం వల్ల దోమలను అరికట్టవచ్చు. అంతేకాదు పుదీనాలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. వంద గ్రాముల పుదీనాలో దాదాపుగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్-ఎ, విటమిన్-బి, బి-2, నియాసిన్‌లు ఉండి 56 కేలరీల శక్తిని ఇస్తుంది.
పుదీనాను ఎండబెట్టి పొడి చేసి రెండు స్పూన్ల పొడిని రెండు గ్లాసుల నీళ్లలో వేసి అరగ్లాసు నీరు మిగిలేవరకు మరిగించి, చల్లార్చి ఆ నీటిని వడకట్టి తాగితే బహిష్టు నొప్పితో బాధపడేవారికి ఆ నొప్పి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా నెలసరి కూడా సక్రమంగా వస్తుంది. ఈ ప్రక్రియను బహిష్టు సమయానికి మూడు నాలుగు రోజుల ముందు నుండి ఆచరించాలి.
ప్రతిరోజు పుదీనా నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గడంతో పాటు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండి పిప్పిపళ్లు రావడం, చిగుళ్ల నుండి చీము రావడం తగ్గుతాయి. మజ్జిగలో పుదీనాను కలిపి వాడటం వల్ల వేసవిలో వడదెబ్బ నుండి రక్షణ లభిస్తుంది. పుదీనాను నలిపి వాసన చూస్తుంటే తలనొప్పి, తల తిరగడం తగ్గుతాయి.
పుదీనా కషాయం రోజుకి మూడుసార్లు సేవిస్తే ఎక్కిళ్లు, దగ్గు, జలుబు తగ్గుతాయి. ఈ కషాయంతో కొద్దిగా ఉప్పు కలిపి కొద్దిసేపు పుక్కిలి పట్టడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది.