ఒక రోజులో మనిషికి 7 గంటల ప్రశాంతమైన నిద్ర కావాలంటారు వైద్య నిపుణులు. నిద్ర అంతకన్నా ఎక్కువైనా.. తక్కవైనా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధనలో వెల్లడించారు. అంతేకాదు, నిద్ర హెచ్చు తగ్గుల కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలోని 30,000 మంది పెద్దవారిపై 2005లో వారు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనలో రోజుకి 7 గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే తొమ్మిది గంటలకుపైగా నిద్రపోయే వారికి గుండె సంబంధింత సమస్యలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నట్లు వారు తెలిపారు. ఎవరైతే ఐదు గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రించే 60ఏళ్ళ వయస్సు ఉన్న వారిలో ఈ సమస్యలు మూడింతలు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఈ పరిశోధన ప్రకారం, తక్కువ సమయం నిద్రించేవారు శ్వాస ఆడకపోవటం వంటి సమస్యతో, అలాగే ఎక్కువ లేదా తక్కువ సమయం నిద్రించేవారు గుండెపోటు, పక్షవాతం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అయితే.. వయస్సు, స్త్రీ, పురుషులు, పొగ తాగేవారు, మద్యపాన ప్రియులు, బక్కపలచనివారు, ఊబకాయులు ఇలా అందరి విషయాల్లోనూ ఈ ఫలితాల ఒకే రకంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.