బిర్యాని అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి. చాలామంది ఇష్టపడే బిర్యానీలో ఘుమఘుమల కోసం పశ్చిమ బెంగాల్‌లో ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్లు ఇటీవలే తేటతెల్లమైంది. దీనితో బిర్యానీ ప్రియులు ఖంగుతిన్నారు. ఇటీవల చిన్నాపెద్దా తేడా లేకుండా అందరు తినే బ్రెడ్‌పై జరిపిన పరీక్షల్లో కేన్సర్ కారక రసాయనాలు అయిన పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడెట్ బయటపడ్డాయని సీఎస్ఈ నిర్ధారించిన విషయం విదితమే.
అయితే ఈ రసాయనాలు నోరూరించే బిర్యానీలో కూడా ఉన్నట్లు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) అధికారులు తేల్చి చెబుతున్నారు. బిర్యానీ తయారీలో సింథటిక్ రసాయనాలను ఉపయోగిస్తున్నారని కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ చేసిన తనిఖీలలో తేటతెల్లమైంది. నగరంలో పలురెస్టారెంట్లు, డాబాలలో తీసుకున్న బిర్యానీలపై పరీక్ష నిర్వహించారు.
పరీక్షల్లో తేలిందేమిటంటే... బిర్యానీ తాజాగా ఉండడం కోసం దానిలో కేన్సర్ కారక మెటానిల్ ఎల్లో అనే రసాయనం వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. బిర్యానీ బియ్యం ఎక్కువగా పసుపు రంగులోకి మారడానికి యజమానులు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు... సాధారణంగా బిర్యాని బియ్యం పసుపు రంగు మారడానికి ఎక్కువగా కుంకుమ పువ్వును వాడుతారు.
కాని దీని ధర ఎక్కువ కావడంతో కుంకుమపువ్వుకు బదులుగా ఈ రసాయనాన్ని చౌకగా కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారని, ఇది కేన్సర్ కారకం అని ఫుడ్ నిపుణులు వెల్లడించారు. బిర్యానీలో రసాయనాల వాడకంపై మున్సిపల్ అధికారులు ఈ మధ్యనే ఆహార సంస్థకు నివేదికలను పంపించారు.