బూడిద గుమ్మడికాయ పీల్‌తో జుట్టుకు ఎంతో మేలు తెలుసా?

శనివారం, 6 ఏప్రియల్ 2019 (12:02 IST)
స్త్రీలకు జుట్టు కూడా అందాన్ని ఇస్తుంది. అలాంటి జుట్టు రాలిపోయినా, పాడైపోయినా అస్సలు సహించరు. దానిని కాపాడుకోవడం కోసం అనేక రసాయనిక ఉత్పత్తులు, షాంపూలు వాడతారు. అయినా ప్రయోజనం ఉండదు. చుండ్రు, పేలతో అధిక ఇబ్బంది పడుతుంటారు. వాటిని నివారించడానికి ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించి జుట్టును సంరక్షించుకోవచ్చు. అవేంటో చూద్దాం. 
 
సాధారణంగా బూడిద గుమ్మడికాయ తొక్కను, గింజలను మనం పారేస్తుంటాం. కానీ అవి కేశ రక్షణను ఎంతగానో ఉపయోగపడతాయి. తొక్కను, గింజలను కొబ్బరి నూనెలో మరిగించి చల్లార్చి ఆ మిశ్రమాన్ని రోజూ తలకు రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడుతూ ఒత్తుగా పెరుగుతాయి. 250 మిలీ మజ్జిగలో 10 గ్రాముల బెల్లం వేసి దానిని తలకు పట్టించుకుంటే చుండ్రు నివారణ అవుతుంది. 
 
నిమ్మరసం పిండి దానిని కేశాలకు రాసుకున్నా చుండ్రు నుండి బయటపడవచ్చు. ఎర్ర మందార పువ్వులను ఎండబెట్టి, వాటిని కొబ్బరి నూనెలో వేసి మరిగించి నిల్వ చేసుకుని రోజూ వాడితే చుండ్రు పోతుంది. గోరింటాకును ఎండబెట్టి పొడిచేసి కొబ్బరి నూనెలో కలిపి వెంట్రుకలకు రోజూ రాసుకుంటే నిగనిగలాడతాయి. పెరుగు, నిమ్మరసం మిశ్రమాన్ని తలకు పట్టించినా చుండ్రు నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
దుకాణాలలో దొరికే కలర్ డైలను ఎక్కువగా ఉపయోగించకూడదు. మార్కెట్‌లో మెహందీ దొరుకుతుంది. దాంతో సహజ సిద్ధమైన డైని తయారు చేసుకోవచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఉసిరికాయ కూడా జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్ద నెల్లికాయలను ఎండబెట్టి గింజలతో సహా పొడి చేసి నిల్వ ఉంచుకుని తలకు పట్టించుకుంటే జుట్టు నల్లగా ఉండటమే కాక చుండ్రు, పేలు నుండి విముక్తి లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు