అధిక ఉష్ణోగ్రత కారణంగా చెలరేగిన కార్చిచ్చు... 51 మంది మృత్యువాత

ఠాగూర్

ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (12:59 IST)
చిలీ దేశంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఉష్ణోగ్రత కారణంగా కార్చిచ్చు చెలరేగింది. దీంతో ఇప్పటివరకు 51 మంది చనిపోయారని చిలీ దేశ అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ వెల్లడించారు. వేలాది మంది గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. 
 
కార్చిచ్చు కారణంగా దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలిబూడిదైనట్లు తెలిపారు. వాల్ఫ‌రైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూనే స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్ విజ్ఞప్తి చేశారు. 
 
కార్చిచ్చు కారణంగా మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని.. వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్లు మంత్రి కరోలినా వెల్లడించారు. మంటల తీవ్రత అధికంగా ఉన్న వాల్ఫరైజో ప్రాంతం నుంచి ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు