ఇజ్రాయేల్ ప్రధాని న్యూయార్క్ టూర్ వెరీ కాస్ట్లీ గురూ.. హెయిర్ కటింగ్‌కు రూ.లక్ష!

శుక్రవారం, 17 జూన్ 2016 (15:25 IST)
''సొమ్ము ఒకడిది, సోకు ఇంకోడిది'' అనే సామెత అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సామెత ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు బాగా వర్తిస్తుంది. అసలు విషయం ఏంటంటే... ఇటీవల బెంజిమన్ ఐక్యరాజ్యసమతి సమావేశాలకు కోసం అమెరికా వెళ్లినప్పుడు అక్కడ పెట్టిన దుబారా ఖర్చుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రజల సొమ్మును దుర్వినియోగపరిచారని పలువురు మండిపడుతున్నారు. 
 
ఇంతకీ ఆయన ఖర్చుల వివరాలను పరిశీలిస్తే... కుబేరుడికి సైతం దిమ్మదిరిగి పోవాల్సిందే. ఆయన జుట్టు కత్తిరించుకోవడానికి అయిన ఖర్చు రూ.లక్ష, బట్టల ఇస్త్రీకి రూ.15 వేలు, భోజనానికి రూ.1.25 లక్షలు, ఫర్నీచర్ కోసం రూ.13 లక్షలు ఖర్చుపెట్టారు. ఆరు రోజుల పాటు ఆయన తన సతీమణితో కలిసి న్యూయార్క్‌ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన కోసం ఇజ్రాయేల్ ప్రభుత్వం ఏకంగా రూ.4 కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా ఆయన డబ్బనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఇదంతా ప్రజల ధనం. 
 
ఈ విషయాలను సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి, ఇజ్రాయేల్‌లో సచార్ బెన్ మీర్ అనే న్యాయవాది... విదేశాంగ శాఖ నుంచి ఈ వివరాలను సేకరించారు. ప్రశ్నించిన వెంటనే తనకు సమాధానం రాలేదని, జరూసలెం కోర్టు ఆదేశాల మేరకు ఈ వివరాలను తెలుసుకున్నానని, మొత్తం రూ.4 కోట్ల ప్రజాధనాన్ని పర్యటన పేరిట మింగేశారని ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి