అశ్లీల వెబ్ సైట్లకు కళ్లెం వేసిన చైనా.. ఏకంగా 4వేల వెబ్‌సైట్ల షట్టర్ క్లోజ్

బుధవారం, 7 డిశెంబరు 2016 (17:03 IST)
అశ్లీల వెబ్ సైట్లపై చైనా కొరడా ఝుళిపించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే వెబ్ సైట్లపై కొత్తగా వచ్చిన సైబర్‌స్పేస్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వాటిని తొలగించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. హింస, అశ్లీల, అసభ్య సమాచారం నిండిన లైవ్‌ స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్లను చైనా మూతపెట్టిందని జిన్‌హువా న్యూస్‌ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది. చైనా ప్రభుత్వం నవంబర్‌లో సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి నియమ, నిబంధలను తీసుకొచ్చింది.
 
వీటి ప్రకారం భద్రత, అస్థిర సమాజం, సామాజిక క్రమానికి విఘాతం కలిగించడం, పోర్నోగ్రఫీతో సహా వ్యర్థ సమాచారాన్ని ఏ వెబ్‌సైటూ అందించకూడదు. దీనిని ఆసగరాగా తీసుకుని చైనా అశ్లీల అసభ్య సైట్లపై కొరడా ఝళిపించింది. ఇందులో భాగంగా రాజధాని బీజింగ్‌ వేదికగా అసభ్య సమాచారాన్ని అంతర్జాలంలో ఉంచుతున్న సుమారు 4000 వెబ్‌సైట్లను ప్రభుత్వం తొలగించింది. ఇంకా కఠినమైన నిబంధనలతో కూడిన ఇంటర్నెట్ వ్యవస్థకు భద్రత కల్పించే దిశగా చైనా సిద్ధమవుతోంది.

వెబ్దునియా పై చదవండి