పొరుగు దేశమైన శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తారా స్థాయికి చేరింది. గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయి రాజపక్సేకు వ్యతిరేంగా ఆందోళనకారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వీరికి మద్దతుగా మాజీ క్రికెటర్లు అర్జున రణతుంగా, జయసూర్యల వీధుల్లోకి వచ్చారు. దీంతో నిరసనకారులు తమ ఆందోళను మరింత ఉధృతం చేశారు.
కాగా, అధ్యక్షుడు గొటబాయ రాజీనామా కోసం జరుగుతున్న నిరసనలకు ఇతర క్రికెటర్లూ మద్దతు తెలపాలని అర్జున రణతుంగ, జయసూర్య కోరారు. వీధుల్లోకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.
మాజీ క్రికెటర్, ఐసీసీ రెఫరీ రోషన్ మహానామా, మాజీ కెప్టెన్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర వంటి వారు ఇప్పటికే అధ్యక్షుడి రాజీనామా కోసం జరుగుతున్న ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. కాగా, అధ్యక్షుడి రాజీనామాను డిమాండ్ చేస్తూ మొదలైన నిరసనలు నిన్నటితో రెండో వారానికి చేరుకున్నాయి.