ఇండోనేషియాలో భారీ భూకంపం.. భూకంప లేఖినిపై 6.7గా నమోదు

ఠాగూర్

మంగళవారం, 9 జనవరి 2024 (09:31 IST)
ఇటీవలికాలంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. మొన్నటికిమొన్న జపాన్ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. ఇపుడు ఇండోనేషియాను మరో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. అయితే, భూకంపం వల్ల సంభవించిన ప్రాణఆస్తి నష్టం వివరాలు తెలియాల్సివుంది. ఇండోనేషియాలోని టలౌడ్ ద్వీపంలో మంగళవారం ఉదయం ఈ భూకంపం సంభవించింది. జాతీయ భూకంప కేంద్రం ప్రకారం భూమికి 80 కిలోమీటర్ లోతులో ఇది సంభవించింది. 
 
కాగా, కొత్త సంవత్సరం రోజు జపాన్ దేశంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. ఇది పెను నష్టాన్ని కలిగించింది. దాదాపు వంద మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరో 200 మంది ఆచూకీ తెలియడం లేదు. గత ఎన్నిదేళ్ల కాలంలో జపాన్ దేశంలో సంభవించిన భారీ భూకంపాల్లో ఇదొకటి. 
 
వివాదాస్పద ట్వీట్ చేసి... పదవులు పోగొట్టుకున్న మాల్దీవుల డిప్యూటీ పీఎం 
 
లక్ష్యద్వీప్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల పిలుపునిచ్చారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కానీ, మాల్దీవులకు చెందిన రాజకీయ నేతలు తొందరపడి భారత్‌ను అవమానకర రీతిలో ట్వీట్ చేశారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మాల్దీవుల ప్రభుత్వం అంతేవేగంగా స్పందించింది. భారత్‌పై వ్యాఖ్యలు చేసిన వారిలో మాల్దీవుల డిప్యూటీ మంత్రి మరియం షివునా, ఎంపీ జహీద్ రమీజ్‌లను పదవుల నుంచి తొలగించారు. 
 
ఏకంగా ప్రధాని నరేంద్రం మోడీని టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేసి కాసేపటికి ఆ ట్వీట్ తొలగించారు. మోడీ ఒక తోలుబొమ్మ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్, హార్దిక్ పాండ్యా, వెంకటేశ్ ప్రసాద్ వంటి ప్రముఖులు మాల్దీవుల నేతల తీరును ఖండించారు. సోషల్ మీడియాలోనూ మాల్దీవులకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
 
దీనిపై మాల్దీవుల ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. మంత్రి మరియంను, ఎంపీ జహీద్ రమీజ్‌ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. అంతకుముందు మరియం షివునా, జహీద్ రమీజ్ చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదించవద్దని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటిని మాల్దీవుల ప్రభుత్వ వైఖరిగా భావించవద్దని భారత్ కు విజ్ఞప్తి చేసింది. తమ భాగస్వామ్య దేశాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. చెప్పినట్టుగానే సదరు నేతలపై సస్పెన్షన్ వేటు వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు