రష్యా వ్యోమగామి అన్నాడు.. భూమికి రాగానే పెళ్లి అన్నాడు.. చివరికి?
బుధవారం, 12 అక్టోబరు 2022 (09:12 IST)
అంతర్జాతీయ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్)లో వున్నానని ఓ వ్యక్తి జపాన్‌లోని ఓ వృద్ధ మహిళకు టోకరా వేశాడు. రష్యా వ్యోమగామినని.. భూమికి తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటానంటూ మహిళను నమ్మించి ఆమె నుంచి రూ.24.8 లక్షల వరకు కాజేశాడు.
సదరు మహిళ జపాన్‌లోని షిగా రాష్ట్రంలో నివసిస్తోంది. గత జూన్‌లో ఆ నకిలీ వ్యోమగామి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. స్పేస్ సూట్ ధరించి ఉన్న అతడి ఫొటోలు చూసిన ఆ వృద్ధురాలు అతడు నిజంగానే వ్యోమగామి అని భావించింది. అక్కడ నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
'లైన్' అనే జపాన్ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశాలు పంపుకునేవారు. కొన్ని రోజుల తర్వాత లవ్ ప్రపోజల్ చేశాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. జపాన్‌లో ఆమెతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని ఉందంటూ ఆమెను ఉచ్చులోకి లాగాడు.
అయితే, ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగి రావాలంటే రాకెట్ ఫీజు కోసం డబ్బు కావాలని ఆ మోసగాడు మహిళకు సందేశం పంపాడు. అది నిజమేనని నమ్మిన ఆ వృద్ధ మహిళ ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 5 మధ్యలో పలు దఫాలుగా డబ్బు పంపించింది.
కానీ మళ్లీ మళ్లీ డబ్బు కావాలని అడగటంతో అనుమానం వచ్చింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడు నకిలీ వ్యోమగామి అని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.