అంతరిక్ష వ్యాపారంలోకి బాలీవుడ్ హీరోయిన్... పెట్టుబడి ఎంతో తెలుసా?
బుధవారం, 26 జూన్ 2019 (13:01 IST)
సినిమాలలో వరుస అవకాశాలతో దూసుకుపోతూ డబ్బు సంపాదించే తారలు రకరకాల వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. దీనిని ముందుజాగ్రత్త చర్యగా కూడా అనుకోవచ్చు. తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకోనే కూడా కొత్త వ్యాపారంలో దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం దీపికా పదుకోనే కెరీర్ పీక్‌లోనే ఉన్నా సరే నటిగా కొనసాగుతూనే నిర్మాతగా అవతారమెత్తి ఛపక్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఆమె అంతరిక్ష వ్యాపార రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇండియాలోని ప్రైవేట్ రాకెట్ స్టార్టప్ కంపెనీ బెల్లాట్రిక్స్ ఎయిరోస్పేస్ భారీగా నిధులను, పెట్టుబడులను ఆహ్వానించింది. ఈ పెట్టుబడుల్లో సింహభాగం దీపికా పదుకోనే పెట్టినట్లు సమాచారం.
ఆమెతో పాటుగా ఐడీఎఫ్‌సీ, స్టార్టప్ ఎక్సీడ్ అనే కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నింటితో కలిపి దాదాపు 3 మిలియన్ డాలర్లను బెల్లాట్రిక్స్ సేకరించినట్లు సమాచారం.
బెల్లాట్రిక్స్ కంపెనీ చేసే పని ఏమిటంటే ఉపగ్రహాల కోసం ఎలక్రిక్ థ్రస్టర్స్ ఉత్పత్తి చేయడం. దీని వలన ఉపగ్రహాల బరువు గణనీయంగా తగ్గుతుంది. దీనితో పాటుగా చేతక్ అనే నానో శాటిలైట్‌ను కూడా రూపొందిస్తోంది.
దీపిక పదుకోనే ప్రస్తుతం ఛపక్ చిత్రానికి నిర్మాతగా ఉంటూ లీడ్‌గా నటిస్తున్నది. ఇక భర్త రణ్‌వీర్‌తో కలిసి 83 అనే చిత్రంలో తెరపై కూడా సతీమణిగా కనిపించనుంది.