అమెరికా మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్ ఇకలేరు..

ఠాగూర్

సోమవారం, 30 డిశెంబరు 2024 (09:15 IST)
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఇకలేరు. అనారోగ్య సమస్యతో జార్జియాలోని  ప్లెయిన్స్‌లో తుదిశ్వాస విడిశారు. ఆయనకు వయసు వందేళ్లు. ఈ విషయాన్ని ఆయన తనయుడు జేమ్స్ ఇ. కార్టర్ 3 వెల్లడించారు. జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ సంతాపం తెలిపారు.
 
వ్యాధుల నిర్మూలన, శాంతిస్థాపన, పౌర, మానవ హక్కుల అభివృద్ధి, స్వేచ్ఛాయుత ఎన్నికలు తదితర అంశాల్లో ఆయన అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారని బైడెన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిమ్మీ మృతి పట్ల కాబోయే అధ్యక్షుడు ట్రంప్ సంతాపం తెలిపారు. అధికారిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది.
 
కాగా, 1924 అక్టోబరు ఒకటో తేదీన జన్మించిన జిమ్మీ కార్టర్.. ఈ యేడాది తన వందో పుట్టినరోజును సంతోషంగా జరుపుకున్నారు. జార్జియాలో పుట్టిన కార్టర్.. 1977-1981 మధ్యకాలంలో అగ్రరాజ్యానికి 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఓ రైతుగా, నేవీ ఉద్యోగిగా, గవర్నర్, ప్రెసిడెంట్‌గా, అన్నింటికీ మించి ఓ మానవతావాదిగా ప్రపంచానికి ఆయన సుపరిచితులు. 2002లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 
 
కేన్సర్ వంటి మహమ్మారినీ జయించిన దృఢ సంకల్పం ఆయన సొంతం. ప్రపంచానికి పెద్దన్నలాంటి అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసి, వందేళ్లు బతికిన తొలి వ్యక్తిగానూ నిలిచారు. 1978లో భారత్ పర్యటనకు కార్టర్ వచ్చారు. ఆయన పర్యటనకు గుర్తుగా హర్యానాలోని ఓ గ్రామానికి కార్టర్‌గా పేరు పెట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు