ఉత్తర కొరియా చీఫ్‌కు షాక్... నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం

బుధవారం, 31 మే 2023 (11:22 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు తేరుకోలేని షాక్ తగిలింది. ఇతర దేశాలపై నిఘా పెట్టేందుకు తయారు చేసి, ప్రయోగించిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. గత బుధవారం ఉదయం 6.29 గంటలకు ఈ శాటిలైట్‌ను ప్రయోగించారు. ఉత్తర కొరియాలోని ఈశాన్య ప్రాంతంలోని తాంగ్‌చాంగ్ రీ లోని ప్రధాన అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్టు సౌత్ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టార్ అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ రాకెట్ ప్రయోగం గాడితప్పింది. ఈ గ్రహ శకలాలు ఎక్కడొచ్చి మీద పడతాయోనని సౌత్ కొరియా భయపడిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధికారిక న్యూస్‌ ఏజెన్సీ కూడా ఈ ప్రయోగం విఫలమైన విషయాన్ని బుధవారం అధికారికంగా వెల్లడించింది. ఉపగ్రహాన్ని తీసుకెళుతున్న రాకెట్‌ తొలి, రెండో దశల సమయంలో థ్రస్ట్‌ను కోల్పోయినట్లు పేర్కొంది. తమ శాస్త్రజ్ఞులు ఈ వైఫల్యానికి గల కారణాలను అధ్యయనం చేస్తున్నారని తెలిపింది. ఈ శకలాలు కొరియా ద్వీపకల్పంలోని ఉత్తరం వైపు సముద్ర జలాల్లో పడినట్లు వెల్లడించింది. కిమ్‌ సైనిక విస్తరణ చర్యలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ.
 
మరోవైపు, ఉత్తరకొరియా ప్రయోగాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇది ఐక్యరాజ్య సమితి ఆంక్షలకు వ్యతిరేకంగా బాలిస్టిక్‌ క్షిపణి టెక్నాలజీని ఉపయోగించడమే అని పేర్కొంది. దీనిపై జాతీయ భద్రతా సలహా మండలి ప్రతినిధి ఆడమ్‌ హోడ్స్‌ మాట్లాడుతూ అధ్యక్షుడు జో బైడెన్‌, నేషనల్‌ సెక్యూరిటీ టీమ్‌ అమెరికా మిత్రదేశాలు, భాగస్వాములతో సమన్వయం చేసుకొంటున్నారని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు