పబ్జీ గేమ్‌పై నిషేధం.. చైనా టెక్ కంపెనీకి రూ.లక్ష కోట్ల నష్టం

గురువారం, 3 సెప్టెంబరు 2020 (22:21 IST)
సరిహద్దుల్లో చైనా పీపుల్స్ ఆర్మీ చేస్తున్న దురాగతాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందుకోసం చైనాకు చెందిన టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా, చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధిస్తోంది. తొలుత 59 యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా మరో 118 యాప్‌లను బ్యాన్ చేసింది. వీటిలో ప్రధానంగా ఎంతో మంది యువత ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్ గేమ్ పబ్జీతో పాటు మరికొన్ని గేమింగ్ యాప్‌లు ఉన్నాయి. 
 
అయితే, పబ్జీపై వేటుపడటంతో ఆ యాప్‌ను తయారు చేసిన చైనా టెక్ కంపెనీ అయిన టెన్సెంట్‌కు 14 బిలియన్ డాలర్ల మేరకు అంటే సుమారు రూ.లక్ష కోట్ల మేరకు నష్టంవాటిల్లినట్టు మార్కెట్ నిపుణుల అంచనాగావుంది. 
 
టెన్సెంట్‌‌కు చెందిన వీ చాట్‌ యాప్‌ను కూడా కేంద్రం ఇటీవల బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. పబ్‌జీకి సంబంధించినంత వరకూ భారత్ టెన్సెంట్‌కు అతి పెద్ద మార్కెట్ కావడంతో.. ఈ పరిణామం కంపెనీకి భారీ కుదుపు అని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 
 
ఈ అంచనాకు తగ్గట్టుగానే.. నిషేధం తర్వాత టెన్సెంట్ షేరు విలువ ఏకంగా 2 శాతం మేర పతనమైంది. సరిహద్దు వద్ద చైనా చెలరేగుతున్న నేపథ్యంలోనే చైనా టెక్ సంస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
మరోవైపు, భారత్ విధించిన నిషేధాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది తమ మదుపర్ల హక్కులను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. ఈ తప్పులను సరిదిద్దు కోవాలని చెబుతూ తప్పంతా భారత్‌దేనని వాదించే ప్రయత్నం చేసింది. 
 
ఈ అంశంపై చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి గో ఫెంగ్‌ మాట్లాడుతూ దేశం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లు, సర్వీస్‌ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలను భారత్‌ ఉల్లంగించిందని ఆరోపించారు. చైనా యాప్‌లపై బ్యాన్‌ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌ నిర్ణయం విచారకమని, మరోసారి నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరారు. 
 
కాగా, భారత సైబర్‌ స్పేస్‌ భద్రతే లక్ష్యంగా పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం విషయం తెలిసిందే. పలు యాప్‌లు యూజర్ల డేటాను చట్టవిరుద్ధంగా భారత్‌కు వెలుపల ఉన్న సర్వర్లకు చేరవేస్తున్నట్లు తమకు వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ‘హానికర యాప్‌’లపై నిషేధం విధించాలని హోంశాఖకు చెందిన సైబర్‌ క్రైమ్‌ సెంటర్‌ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 
 
అలాగే జూన్‌లో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై బ్యాన్‌ విధించింది. సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు భారత్‌ మరోసారి గట్టి ఝలక్‌ ఇచ్చింది. పబ్‌జీతోపాటు ఆ దేశానికి చెందిన 118 యాప్‌లపై నిషేధం విధించింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 
 
భారత్‌లో దాదాపు 3.3 కోట్ల మంది క్రియాశీలక పబ్‌జీ యూజర్లు ఉన్నట్లు అంచనా. నిషేధానికి గురైన వాటిలో పబ్‌జీతోపాటు పబ్‌జీలైట్‌, బైదు, బైదు ఎక్స్‌ప్రెస్‌ ఎడిషన్‌, టెన్సెంట్‌ వాచ్‌లిస్ట్‌, ఫేస్‌యూ, వియ్‌చాట్‌ రీడింగ్‌, టెన్సెంట్‌ వీయూన్‌ వంటి యాప్‌లు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు