నా కూతురుని పెళ్లి చేసుకుంటే రూ.2 కోట్లిస్తా: ఓ మిలియనీర్ తండ్రి ప్రకటన

శుక్రవారం, 8 మార్చి 2019 (15:20 IST)
జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా బాగుంటుంది అన్నట్లు... వరకట్నాలు ఇచ్చుకోలేక... ఇచ్చినా ఆ ఇచ్చిన మొత్తాలు సరిపోక.. వేధింపులకు గురవుతున్న అమ్మాయిలు ఒకవైపు బాధపడుతుంటే... అసలు వరకట్న సమస్యే లేకుండా కన్యాశుల్కం కొనసాగుతున్న దేశంలో... మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రెండు కోట్లు ఇస్తానని ప్రకటించేసాడు ఒక మిలీయనర్ తండ్రి.
 
వివరాలలోకి వెళ్తే... థాయ్‌లాండ్‌కి చెందిన ఆర్నాన్ రోడాంగ్ అనే ఓ మిలియనీర్ వ్యాపారి తన కూతురిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి 2 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రకటించడమే. ఆ ప్రకటనలో ఆయన, ''నా కూతురికి 26 ఏళ్లు. తనకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఇప్పటి వరకూ చూసిన అబ్బాయిల్లో తనకు ఎవరూ నచ్చలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నా కూతుర్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారికి రెండు కోట్ల రూపాయలు బహుమానంగా ఇవ్వడమే కాకుండా నా వ్యాపారంలో వాటా కూడా ఇస్తాను" అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టేసాడు. ఇది చూసిన చాలా మంది ముందుగా షాకయ్యారు. 
 
అబ్బాయి ఎంత వరకు చదువుకున్నా ఫర్వా లేదని, కష్టించి పనిచేసే తత్వం ఉంటే చాలని పేర్కొన్న ఆ ప్రకటనలో ఆసక్తి గలవారు ఏ దేశస్తులైనా కూడా పర్వాలేదనే మినహాయిస్తూ, తనను సంప్రదించాలని కోరాడు. వారిలో తన కూతురికి నచ్చిన వారిని తన అల్లుడిగా చేసుకొని రెండుకోట్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. కాగా... స్నేహితురాళ్ల ద్వారా విషయం తెలుసుకున్న ఆర్నాన్ కూతురు కర్నిస్టా నవ్వేసింది. తనకు కూడా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తే భర్తగా కావాలని, అయితే ఆ రెండుకోట్లు తన దగ్గర్నుంచి తీసుకోవడం సులభం కాదని నవ్వుతూ హెచ్చరించింది.
 
భారతదేశంలోలా థాయ్‌లాండ్‌లో వరకట్న విధానం లేదు, అక్కడ ఇప్పటికీ కన్యాశుల్కం పద్ధతినే అనుసరిస్తారు. అలాంటిది ఆ సంప్రదాయాన్ని కూడా పక్కనబెట్టి ఈ ప్రకటన చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు