తొలి సుదూర నాన్‌స్టాప్‌ విమాన సారథులు

ఆదివారం, 10 జనవరి 2021 (10:53 IST)
ఎయిర్‌ ఇండియాకు చెందిన మహిళా పైలట్లు చరిత్ర సృష్టించబోతున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు తొలి సుదూర నాన్‌స్టాప్‌ కమర్షియల్‌ విమానాన్ని మొత్తం మహిళా పైలట్లే నడపనున్నారు. ఈ విమానం ఉత్తర ధ్రువం మీదుగా వెళ్లి అట్లాంటిక్‌ మార్గంలో ప్రయాణించి బెంగళూరుకు చేరుకుంటుంది.

‘‘ఎయిర్‌ ఇండియా నడుపుతున్న అత్యంత సుదూర కమర్షియల్‌ విమానం ఇదే. గాలి వేగాన్ని బట్టి ఈ మార్గంలో మొత్తం ప్రయాణ సమయం 17 గంటలకు పైగా ఉంటుంది’’ అని ఆ సంస్థ పేర్కొంది. ఈ రెండు నగరాల మధ్య దూరం 13,993 కిలో మీటర్లు. టైమ్‌ జోన్‌లో మార్పు 13.5 గంటలు ఉంటుందని ఎయిర్‌ ఇండియా అధికారి ఒకరు తెలిపారు.

‘‘మొత్తం మహిళా కాక్‌పిట్‌ సిబ్బంది... కెప్టెన్‌ జోయా అగర్వాల్‌, కెప్టెన్‌ పపగారి తన్మయి, కెప్టెన్‌ ఆకాన్ష సోనావర్‌, కెప్టెన్‌ శివాణి మన్హస్‌.. బెంగళూరు, శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య తొలి చరిత్రాత్మక విమానాన్ని నడపనున్నారు’’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ట్విటర్‌లో పేర్కొన్నారు. వారికి అభినందనలు తెలిపారు.

కాగా ఏఐ 176 విమానం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి శనివారం రాత్రి 8.30 (స్థానిక కాలమానం) గంటకు బయలుదేరి సోమవారం ఉదయం 3.45 గంటలకు (స్థానిక కాలమానం) బెంగళూరులో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనుంది. కాగా జనవరి 15 నుంచి హైదరాబాద్‌, చికాగో మధ్య తొలి నాన్‌స్టాప్‌ సర్వీసును కూడా ప్రారంభించాలని ఎయిర్‌ ఇండియా యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు