అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. ఫలితంగా అక్కడ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. న్యూయార్క్ నగరంతో పాటు బఫెలో నగరం ఇపుడు మంచు దుప్పటి కింద చిక్కుకుపోయింది. అలాగే, మంచులో చిక్కుకునిపోయిన కార్లలో ఒక్కో శవం బయటపడుతుంది. ఈ మంచు తుఫాను కారణంగా అమెరికాలో ఇప్పటివరకు 60 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దేశ వ్యాప్తంగా 15 వేలకుపైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ మంచు తుఫాను భీకరంగా విరుచుకుపడటంతో "ఈ శతాబ్దపు మంచు తుఫాను"గా అధికారులు అభివర్ణిస్తున్నారు.
అమెరికాలోని ప్రధాన రహదారులతో పాటు బస్సులు, అంబులెన్సులు, ట్రక్కులు మంచుతో నిండిపోయాయి. వీధులన్నీ తెల్లటి మంచుతో కప్పివున్నాయి. దీంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఒంటరిగా ఉండేవారితో పాటు అనారోగ్యంతో ఉండేవారికి వైద్యసేవలు కూడా అందించలేని దయనీయమైన పరిస్థితులు నెలకొనివున్నాయి.
క్షతగాత్రులను హైలిఫ్ట్ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. బఫెలో నగరంలో మంచులో కూరుకునిపోయిన వాహనాల్లో మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ మంచు మంగళవారం కురిసే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏమాత్రం వాతావరణం అనుకూలించకపోవడంతో ఏకంగా 15 వేల విమాన సర్వీసులను రద్దు చేశారు.