బురఖా తొలగించేందుకు నిరాకరించింది.. నాలుగు నెలల జైలు.. జరిమానా విధించారు..

ఆదివారం, 13 నవంబరు 2016 (10:10 IST)
బురఖాను తొలగించేందుకు నిరాకరించిన పాపానికి నాలుగు నెలల జైలు శిక్ష విధించారు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. ముస్లిం మహిళలు బురఖాను ధరించడం సంప్రదాయంగా భావిస్తారు. ఇంకా తమ ముఖాన్ని ఇతరులకు చూపించేందుకు ఇష్టపడరు. అలాంటిది ఓ ముస్లిమ్ మహిళ ధరించిన బురఖాను తొలగించేందుకు నిరాకరించిందని ఆమెకు కోర్టు న్యాయమూర్తి జరిమానా విధించారు. 
 
వివరాల్లోకి వెళితే.. 40 ఏళ్ల వయసు గల ముస్లిం మహిళ శాన్ విటో అల్ టాగ్లీయోమెంటో నగరంలో నివశిస్తున్నారు. ఆమెకు ఇటలీ దేశ పౌరసత్వం లభించిందని ఇటలీ పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో సదరు మహిళ బురఖాతో ఇటలీలోని శాన్ వీటో అల్ టాగ్లీయోమెంటో పబ్లిక్ భవనం టౌన్ హాలు వద్దకు వచ్చింది. కళ్లు మాత్రమే కనిపించేలా బురఖా ధరించి తిరుగుతుండటంతో ఇటలీ పోలీసులు బురఖాను తొలగించాల్సిందిగా ముఖాన్ని చూపించాల్సిందిగా డిమాండ్ చేశారు. 
 
ఇందుకు ఆమె నిరాకరించడంతో కేసు పెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టారు. పోర్డినోన్ ప్రావిన్సు న్యాయమూర్తి ఆమెకు 30,000 యూరోల జరిమానా విధించారు. సదరు మహిళ కోర్టు విధించిన జరిమానాను చెల్లించకపోవడంతో ఆమెకు నాలుగు నెలల కారాగార శిక్షగా మార్చారు. 

వెబ్దునియా పై చదవండి