ఈ 'ఇజం' అదే... మహేష్ బాబు రెస్పాన్స్ కోసం చూస్తున్నా... పూరీ జగన్నాథ్
బుధవారం, 19 అక్టోబరు 2016 (22:16 IST)
హీరోయిజాన్ని కొత్తగా ఆవిష్కరంచడంతోపాటు పోకిరి, ఇడియట్ గానూ హీరోయిజంలో వుందని చెప్పే దర్శకుడు పూరీ జగన్నాథ్. అలాగే ఇంటెన్సిటీ ఉన్న డైలాగులు రాయడం లాంటివి ఒక అలవాటుగా మారిపోయాయి. ఇక తాజాగా ఆయన తన స్టైల్లో హీరో కళ్యాణ్ రామ్‌తో తెరకెక్కించిన 'ఇజం' అనే సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమా గురించి పూరీ చెప్పిన విశేషాలు..
చాలా 'ఇజాలు టైటిల్‌లో పెట్టారు.. ఈ ఇజంలో ఏముంది?
అన్ని ఇజాల్లో కొత్త ఇజం వున్న కథ ఇది. కథను పదేళ్ళ క్రితమే రాశా. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు ఆ కథలో మార్పులు చేసి ఇప్పటికి సినిమాగా తీసుకొచ్చా.
'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమాలో అవినీతి గురించి ప్రస్తావించారు. ఇప్పుడు మళ్ళీ అదే అవినీతిపై కొత్తగా ఏం చెబుతున్నారు?
అది వేరు ఇది వేరు. నన్నడిగితే అవినీతి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఇదే విషయాన్ని మరోసారి కొత్త కోణంలో చెప్పా. అదేంటన్నది సినిమా చూసి తెల్సుకోవాల్సిందే.
కళ్యాణ్ రామ్‌ను ఎలా చూపించబోతున్నారు?
కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారు. నిజ జీవితంలోనూ చాలా నిజాయితీగా ఉంటారాయన. దీంతో ఆయనతోనే ఈ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకున్నా. ఇజంలో కళ్యాణ్ రామ్ చాలా బాగా నటించారు. ఇందులో ఆయన నటనకు ఈ సంవత్సరానికి బెస్ట్ యాక్టర్‌గా అవార్డులన్నీ వస్తాయనుకుంటున్నా.
సిక్స్ ప్యాక్ అవసరమా?
కళ్యాణ్ రామ్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించాలన్నది నా ఆలోచనే. పాత్ర అవసరానికి తగ్గట్టు సమాజం గురించి ఎంతో ఆలోచించే వ్యక్తి, తానూ స్వయంగా ఫిట్‌గా ఉండాలనే అలా చేశా. ఈ లుక్ కోసం కళ్యాణ్ రామ్ మూడు నెలల పాటు నిరంతరం కష్టపడ్డారు.
మీ సినిమాలన్నింటిలోనూ సోషల్ కనెక్ట్ ఉండేలా చూసుకుంటారు ఎందుకని?
ఇప్పుడు సొసైటీ పూర్తిగా మారిపోయింది. అవినీతి లాంటివి మన జీవితాల్లోకి పూర్తిగా వచ్చేశాయి. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడే రకరకాల ఆలోచనలు కలిగి, నిజ జీవితాలను ప్రేరణగా తీసుకొని కథలు రాస్తూంటా. ఇజం కూడా అలా పుట్టిన కథే!
వికీలీక్స్ స్పూర్తితో రాశారా?
దానికంటే ముందే కథను రాసుకున్నా. దాదాపు పదేళ్ళ క్రితం రాసుకున్నా. అప్పటికీ ఇప్పటికీ జర్నలిజం శైలి మారింది. అయితే ఇజంలో వికిలీక్స్ పబ్లిషర్ జులియన్ అసాంజేను స్పూర్తిగా తీసుకుని కళ్యాణ్‌రామ్ పాత్రను తీర్చాను.
హీరోయిన్ అదితి ఆర్య గురించి చెప్పండి?
అదితి ఆర్య గతంలో మిస్ ఇండియాగా ఎంపికైన అమ్మాయి. ఇజంలో ఓ బలమైన పాత్రలో అదితి చాలా బాగా నటించింది.
పీకె సన్నివేశాలున్నాయటగా?
దానికి సంబంధించిన సన్నివేశాలు లేవు. అసలు ఆ అవసరంలేదు.
నందమూరి వారే కోర్టు సీను చేయగలరని ఆడియోలో అన్నారు?
సినిమాకు కీలకం కోర్టు సీన్. ఇదే హైలైట్. కళ్యాణ్‌రామ్ అద్భుతంగా చేశాడు. గతంలో ఎన్‌టిఆర్ కోర్టు సీన్‌కు ఫేమస్. ఆయన బ్లడ్ కాబట్టి.. కళ్యాణ్‌రామ్ చెబుతుంటే.. ఆకర్షణీయంగా వుంఇ. ఆయన డైలాగ్స్ చెబుతున్నట్లు వుండదు. నిజాయితీగా చెబుతున్నట్లు వుంటుంది. జర్నలిస్టు ఫైర్‌తో ఎలా ప్రశ్నిస్తాడో అలా కన్పిస్తుంది.
ఈ సినిమాలో ఓ పాట రాయడంతో పాటు పాడారు కూడా?
అది అనూప్ ఆలోచనే! ఇజం అనే పాట నేనే పాడితే బాగుంటుందని పాడించేశాడు.
మహేష్ బాబు సినిమా ఎంతవరకు వచ్చింది?
మహేష్‌కు ఇప్పటికే స్క్రిప్ట్ వినిపించా, అది ఓకే అయింది కూడా. అయితే ఆ తర్వాత మహేష్ నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. నేను ఆయన రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నా.
' రోగ్' సినిమా ఎంతవరకొచ్చింది?
చిత్రీకరణ మొత్తం పూర్తైంది. డిసెంబర్ నెలలో అది విడుదలవుతుంది.
కథా ఆలోచనలు ఎలా పుడుతుంటాయి?
రోజూ సొసైటీని చూస్తూ ఉంటే అవే వచ్చేస్తూంటాయి. ఒక ఐడియా రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాసేస్తుంటా. నా దగ్గర మరో పదేళ్ళకు సరిపడా కథలున్నాయి.
గోల్స్ ఏంటి?
ఇప్పటికే అందరు స్టార్స్‌తో సినిమాలు చేసేశా. ఇండియన్, హాలీవుడ్ స్టార్స్‌ని కలిపి ఒక సినిమా చేయాలన్న కోరిక ఉంది అని చెప్పారు.