కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఎట్టకేలకు దుబాయ్‌లో ఐపీఎల్-2020 టోర్ని జరుగబోతోంది. అయితే ఈ సారి టైటిల్ ఎవరు గెలుస్తారని అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. దీనిపై ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్‌లీ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఈసారి ఐపీఎల్ టైటిల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎస్‌కేను కైవసం చేసుకుంటుందని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ కవరేజ్‌లో భాగంగా బ్రాడ్‌కాస్టర్స్ హోస్ట్‌గా చేయనున్న బ్రెట్ లీ.. ప్రస్తుతం ముంబైకు చేరుకుని ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు బ్రెట్‌లీ సమాధానమిచ్చాడు. ఈసారి ఐపీఎల్ టైటిల్ ఎవరదని భావిస్తున్నారు.. అని అడిగిన ప్రశ్నకు సీఎస్‌కే అని చెప్పాడు. విజేతను చెప్పడం కష్టమే అయినా తాను మాత్రం సీఎస్‌కేనే టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నానని చెప్పాడు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని జోస్యం చెప్పాడు.
ఇకపోతే... 2019 సీజన్‌లో ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ నాలుగో సారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో చెన్నై కేవలం ఒక పరుగు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న చెన్నై ఆశలు ఆవిరి అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్‌లో ఖచ్చితంగా సీఎస్‌కే టైటిల్‌ను గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అభిప్రాయ పడ్డాడు.