స్మార్ట్ ఫోన్లు ఉపయోగించారో.. జ్ఞాపకశక్తి అవుట్..

బుధవారం, 19 జులై 2017 (09:11 IST)
అత్యాధునిక సాంకేతిక పరికరాలతో లాభాలున్నా.. ఆరోగ్యపరంగా నష్టాలు తప్పవని ఇప్పటికే పలు పరిశోధనలు హెచ్చరించాయి. తాజాగా స్మార్ట్ ఫోన్లను అధికంగా ఉపయోగించే వారిలో జ్ఞాపకశక్తి తగ్గుతుందని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లోని మ్యాక్స్‌కోంబ్స్ బిజినెస్‌ స్కూల్‌ నిర్వహించిన పరిశోధనలో తెలిపింది. 800 మందిపై జరిగిన ఈ పరిశోధనలో ఒక గ్రూప్ వారి సెల్‌ఫోన్‌లను వారి దగ్గరిగా ఉంచకుండా పక్క రూమ్‌లో ఉంచారు. 
 
రెండో గ్రూపులోని వారి సెల్ ఫోన్లను టేబుల్‌పైన ఉంచారు. ఇక మూడు గ్రూపుల్లో ఉన్నవారి సెల్ ఫోన్లను వారి జేబుల్లో లేక బ్యాగుల్లో ఉంచారు. వీరిపై జరిపిన పరిశోధనలో పక్క గదిలో ఫోన్లను భద్రపరిచిన వారు, టేబుళ్లపై ఫోన్లను పెట్టుకున్న వారికంటే బాగా ఫలితాలు సాధించినట్లు వెల్లడి అయ్యింది. ఇంకా సెల్ ఫోన్లను తరచూ ఉపయోగించే వారిలో జ్ఞాపకశక్తి తగ్గుతూ వచ్చిందని.. సెల్ ఫోన్‌కు దూరంగా ఉన్నవారే మంచి ఫలితాలను రాబట్టారని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి