వివాదాలకు మారుపేరుగా తరచూ వార్తల్లో ఉండే కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశి థరూర్ మరోసారి సంచలనాన్ని సృష్టించేందుకు సిద్ధమౌతున్నట్లు సమాచారం. మాజీ దౌత్యవేత్త, మంత్రి థరూర్(54) కాశ్మీర్‌కు చెందిన సౌందర్య నిపుణురాలు సునందను పెళ్ళాడేందుకు సిద్ధపడ్డట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కాశ్మీరీ కుటంబానికి చెందిన సునంద దుబాయ్‌లో సౌందర్య సంరక్షణశాలను నడుపుతున్నారు. తాను వివాహమాడతానని థరూర్ ఈమెను ముందుగానే అడిగినట్లు సమాచారం. సునందను వివాహమాడేందుకు తన రెండవ భార్య కెనడాకు చెందిన క్రిష్టా గీల్స్‌తో చట్టపరమైన సమస్యలున్నాయని, అవి తొలగిపోయిన వెంటనే తాను సునందను వివాహమాడేందుకు సిద్ధంగానున్నట్లు థరూర్ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
క్రిష్టా ప్రస్తుతం అమెరికాలో పని చేస్తున్నారు. అంతకు మునుపు కోలకతాలో తన చిన్న నాటి స్నేహితురాలైన తిలోత్తమా ముఖర్జీని వివామాడారు. ఆమెతో పొరపొచ్చాలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చి క్రిష్టాను థరూర్ రెండవ వివాహం చేసుకున్నట్లు సమాచారం.