ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు మూడిందని, త్వరలోనే అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అన్నాడీఎంకే అమ్మ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ బంధువు టీటీవీ దినకరన్ హెచ్చరించారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన తన వర్గ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, మంగళవారం ఉదయం 10.30 గంటలకు తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుతో భేటీ కానున్నారు.
నిజానికి అన్నాడీఎంకే వైరి వర్గాలు (ఈపీఎస్, ఓపీఎస్) సోమవారం ఒక్కటైన విషయం తెల్సిందే. ఆ తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించారు. దీన్ని దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు ఏమాత్రం అంగీకరించడం లేదు. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం విలీనం చెల్లదని టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు.
ఇదే అంశంపై ఆయన చెన్నైలో మాట్లాడుతూ, వారి విలీనం చెల్లదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరామని, గవర్నర్‌ను కలిసి విలీనంపై ఫిర్యాదు చేస్తానన్నారు. తన వద్ద 25 మంది ఎమ్యెల్యేలు ఉన్నారన్నారు. ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తాను చెప్పలేనని చెప్పడం గమనార్హం.
పదవిని కాపాడుకునేందుకు పన్నీర్, పళని కలిశారని ఆయన ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యేలు సముఖంగా లేరని ఆయన చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు తమను సంప్రదించి, ఈ విలీనంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. గవర్నర్‌ను కలిసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని దినకరన్ ప్రకటించారు.