పెద్ద నోట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్‌లో నోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బు లేకపోవడంతో సామాన్యులు అల్లాడుతున్నారు. పాత పెద్ద నోట్లను రద్దు చేసి 22 రోజులు అవుతున్నా 25 శాతం ఏటీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరే ఖాతాదారుల కోసం మజ్జిగ, మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలని బ్యాంకు అధికారులను ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు.
నగరంపాలెంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్, ఏటీఎంల వద్ద క్యూలైన్లలో ఉన్న వారితో మాట్లాడారు. క్యూలైన్‌లో ఉన్న ఖాతాదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాము ఏ నోట్లు అడిగినా బ్యాంకు అధికారులు రూ.రెండువేలు నోట్లే ఇస్తున్నారన్నారు. మరో ఖాతాదారుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదేనని.. అయితే వృద్ధులమైన తమకు ఈ కష్టాలు ఏమిటని ప్రశ్నించారు.
గంటల తరబడి క్యూ లైన్లలో తాము నిలబడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీజీపీ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఖాతాదారుడిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనపై తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పోలీసులు దురుసుగా ప్రవర్తించకుండా తగు ఆదేశాలుజారీ చేస్తామన్నారు.