మహిళలను నమ్మించి, వంచించి వారిపై అత్యాచారాలు చేసేందుకు రకరకాల ప్రణాళికలతో వస్తున్నారు కామాంధులు. తమిళనాడులోని తేనిలో ఓ బ్యాంక్ మేనేజర్ తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారాలకు పాల్పడిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకులకు రుణాల కోసం వచ్చే మహిళల ఆర్థిక పరిస్థితులను ఆసరా చేసుకుని వారికి బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికేవాడు.
ఈ బ్యాంకు మేనేజర్ కామాంధుడి ఆగడాలను ఓ మహిళ బయటపెట్టింది. తేని జిల్లాకి చెందిన సదరు మహిళ ఇతర రాష్ట్రంలో పనిచేస్తున్న భర్త పంపిన డబ్బు డ్రా చేసేందుకు బ్యాంకుకి వచ్చేది. ఆమెను ప్రతి నెలా గమనిస్తున్న బ్యాంక్ మేనేజర్ ముత్తు శివకార్తికేయన్ ఆమెపై కన్నేశాడు. ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో వుంటున్న సంగతితో పాటు ఆమె భర్త దూరంగా వున్నాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు. దీనితో మెల్లిగా ఆమెతో సన్నిహితంగా వుంటూ ఆర్థికంగా ఆదుకుంటాననీ, బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు.
ఈ క్రమంలో ఓ రోజు ఏకంగా ఆమె ఇంటికే వెళ్లాడు. ఒంటరిగా వున్న సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో వీడియో తీసి తన స్నేహితుల కోర్కెను కూడా తీర్చాలని వేధించాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన సదరు మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంక్ మేనేజర్ ముత్తును అరెస్టు చేశారు. అతడితో పాటు అత్యాచారాలకు పాల్పడినవారి కోసం గాలిస్తున్నారు. కాగా నిందితుడు మరో ఆరుగురి మహిళలపై కూడా ఇదే తరహాలో అత్యాచారాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.