దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు, ఎంజీఆర్ జయ దీప పేరవై ప్రధాన కార్యదర్శి దీపా జయకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అదీ కూడా మరో రాజకీయ పార్టీ అధినేత డాక్టర్ రాందాస్ అనుచరగణంపై. పీఎంకే తమిళనాడులో ప్రముఖ పార్టీగా ఉన్న విషయం తెల్సిందే.
ఇదే అంశంపై ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన మేనత్త దివంగత జయలలిత ఆశయాలను కొనసాగించేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేశానేగానీ, అధికారం దాహంతో కాదన్నారు. తనను తొలుత రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు పలువురు పావులు కదిపారని, అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదని, వారి కుయుక్తులన్నీ అడ్డుకుని, తాను రాజకీయ రంగప్రవేశం చేశానని చెప్పారు.
వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు తనను హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్ అనుచరులు తనకు ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. రాందాస్ చెబుతున్న 'అవినీతి నిర్మూలన' ప్రకటనలన్నీ భోగస్ అని ఆమె చెప్పారు. కులాల పేరుతో పీఎంకే నేతలు రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనను బెదిరించినా, తన మేనత్త జయలలితను ఆదర్శంగా తీసుకుని రాజకీయ ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కొంటానని ఆమె ప్రకటించారు.