భయం వద్దు: 90శాతం రోగులకు ఇంటివద్దే నయం

సోమవారం, 26 ఏప్రియల్ 2021 (19:55 IST)
దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో కరోనా వైరస్‌ మహమ్మారికి భయపడొద్దని.. అది కేవలం స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ మాత్రమేనని ఆరోగ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.

వైరస్‌ సోకిన వారిలో 85 నుంచి 90శాతం రోగులు లక్షణాలకు అనుగుణంగా ఇంటివద్దే చికిత్స తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌, ఇతర ఔషధాలను ఇళ్లలో నిల్వచేసుకోవడం అనవసర భయాలు సృష్టిస్తాయని.. అంతేకాకుండా ఈ చర్యల వల్ల మార్కెట్‌లోనూ వీటి కొరత ఏర్పడుతుందని స్పష్టం చేస్తున్నారు.

భయాలు వద్దు..
‘కొవిడ్‌-19 కేవలం స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ మాత్రమే. 85 నుంచి 90 శాతం మంది ప్రజలు జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. వీటికి ఇంటివద్దే చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ అవసరం లేదు’ అని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టంచేశారు.

కేవలం 10 నుంచి 15శాతం రోగులకు మాత్రమే ఆక్సిజన్, రెమ్‌డెసివిర్‌ లేదా ప్లాస్మా అవసరం అవుతుందన్నారు. 5శాతానికి తక్కువ మందికి మాత్రమే వెంటిలేటర్‌ లేదా ఐసీయూ చికిత్స ఇవ్వాల్సి వస్తోందని డాక్టర్‌ గులేరియా పేర్కొన్నారు.

అనవసర భయాలకు లోనుకాకుండా ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ వంటి ఔషధాలను ఇళ్లలో నిల్వచేసుకోవద్దని స్పష్టం చేశారు. వీటి వల్ల భయాలు కలగడమే కాకుండా మార్కెట్‌లో ఔషధాలకు కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు.

రెమ్‌డెసివిర్‌ మంత్రదండం కాదు..
కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ.. రెమ్‌డెసివిర్‌ ఔషధానికి తీవ్ర డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఔషధం మ్యాజిక్‌ బుల్లెట్‌ కాదని..కేవలం ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారికే ఇది అవసరమవుతుందని రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు.

అనవసర భయాలకు లోనుకావద్దని.. అదే సమయంలో ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌లను వృథా చేయకూడదని  సూచించారు. కొవిడ్‌ నిబంధనలు కఠినంగా పాటించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కొన్ని వారాల్లోనే వైరస్‌ వ్యాప్తిని అదుపులోకి తేవచ్చని ఆయన సూచించారు.

యోగాతో మేలు..
ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌ తేలిన వెంటనే స్థానిక డాక్టర్‌ను సంప్రదించాలని మేదాంత ఆసుపత్రి సీఎండీ డాక్టర్‌ నరేష్‌ ట్రేహన్‌ పేర్కొన్నారు. లక్షణాలున్నట్లయితే వారు సూచించిన ఔషధాలను మాత్రమే వాడాలన్నారు. వీటితో పాటు యోగా, ప్రాణాయామం చేయడంతో పాటు ప్రోనింగ్‌ వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుందని సూచించారు.

వ్యాక్సిన్‌, కొవిడ్‌ నిబంధనలతోనే అదుపులోకి..
సెకండ్‌ వేవ్‌తో దేశాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని కేవలం కొవిడ్‌ నిబంధనలను పాటించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్లే అదుపులోకి తీసుకురావొచ్చని ఎయిమ్స్‌ వైద్య నిపుణులు సూచించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేస్తున్నారు.

గతంతో పోలిస్తే ప్రస్తుతం కొవిడ్‌ నిర్ధారణ చేసే ల్యాబ్‌లు, వైద్య పరికరాలు, మెడికల్‌ ఆక్సిజన్‌, పలు ఔషధాలతో పాటు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సహకారంతో వైరస్‌ వ్యాప్తికి త్వరలోనే అడ్డుకట్ట వేయవచ్చని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు